శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pyr
Last Modified: శనివారం, 18 ఏప్రియల్ 2015 (07:59 IST)

కూతురిపై ప్రేమోన్మాది దాడి... ప్రేమోన్మాదిని మట్టుబెట్టిన తండ్రి

అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఇల్లంతా రక్తసిక్తమయ్యింది. అందులో నివసిస్తున్న వారంత గాయాలపాలయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి ఆ ఇంటి యజమాని ఓ ప్రేమోన్మాదిని హత్య చేయాల్సిన స్థితి ఏర్పండింది. రెండు గంటల తేడాతో ఆ ఇల్లు గందరగోళంగా తయారయ్యింది. తన కూతురిపై దాడి చేస్తున్న ప్రేమోన్మాదిపై తండ్రి తిరుగుబాటు చేసి అతనిని మట్టుబెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పుగోదావరి జిల్లా ఎర్రపాలెం గ్రామానికి చెందిన వల్లభరావు (67) కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆవులను పోషిస్తూ కుటుంబం వెళ్లదీస్తున్నారు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమార్తె నీరజ కృష్ణవేణి.. కేపీహెచ్‌బీ కాలనీలోని ఇంటీరియర్ డెకరేషన్ షాపులో పని చేస్తోంది. చేవెళ్లకు చెందిన రాజు (25) అలియాస్ మల్లేశ్ ప్రశాంత్‌నగర్‌లోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
నీరజ పని చేస్తున్న కాంప్లెక్స్‌లో గతంలో ఇతడు ఓ మొబైల్ షాపులో పనిచేశాడు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ నీరజ వెంటపడుతున్నాడు. సంవత్సరం కిందట యువతి ఇంటికే వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడాడు. నీరజను ప్రేమించానని, తనకిచ్చి పెళ్లి చేయాలన్నాడు. అయితే వల్లభరావు తన కూతురు వెంటపడొద్దని గట్టిగా చెప్పి పంపించేశాడు. ఆ నిరాకరణే అతనిలోని ప్రేమోన్మాదాన్ని తట్టి లేపింది. ఎలాగైనా నీరజను చంపాలని నిర్ణయించుకున్నాడు. 
 
శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు వేటకొడవలితో నీరజ ఇంట్లోకి చొరబడి ఆమె దాడి చేశాడు.  ప్రతిఘటించిన ఆమె తల్లి తులసమ్మ, మరో బంధవు దుర్గా గంగాధర్‌లు రాజులపై కూడా దాడి చేశాడు అప్పుడే నీళ్లు తెచ్చేందుకు బయటకు వెళ్లిన తండ్రి వల్లభరావు.. ఇంట్లోంచి అరుపులు, కేకలు వినిపించడంతో పరుగుపరుగున వచ్చారు. 
 
రాజు ఆయనపైనా దాడికి దిగాడు. కుటుంబాన్ని ఆ స్థితిలో చూసిన వల్లభరావుకు ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. ప్రతిఘటించాడు. చివరికి రాజు తీసుకువచ్చిన కొడవలినే తన చేతిలోకి తీసుకున్నాడు. దానితో రాజును అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి, సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడినా నీరజ తీవ్ర గాయాలపాలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.