శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (10:23 IST)

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గులాబీ జెండా: మేయర్ రేసులో పీజేఆర్ తనయ!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. మొత్తం 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏ ఒక్కరి మద్దతు అవసరం లేకుండానే గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం వెలువడ్డ ఫలితాల్లో అన్ని పార్టీలకు షాకిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా ఏంటో నిరూపించారు. 
 
ఇక ఈ నెల 11న గ్రేటర్ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆసీనులు కానున్నారు. ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఎవరినీ టీఆర్ఎస్ ప్రకటించలేదు. తాజాగా పూర్తి మెజారిటీ సాధించిన ఆ పార్టీ గ్రేటర్ పాలకవర్గం బాధ్యతల్లో పూర్తి కాలం పాటు కొనసాగనుంది. పార్టీ టికెట్ పై విజయం సాధించిన పలువురు అభ్యర్థులు గ్రేటర్ పీఠం తమదేనని ఆశల పల్లకీలో ఊరేగుతున్నా... పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకం కానుంది. 
 
అంతేకాక ఈ విషయంలో కేటీఆర్ సూచించిన అభ్యర్థికే కేసీఆర్ మేయర్ పీఠం బాధ్యతలు అప్పగించడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో మేయర్ పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్న అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉన్నా, దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఖైరతాబాదు డివిజన్ నుంచి బరిలోకి దిగిన విజయారెడ్డి, ఎన్నికల్లో 16,341 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.