శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (16:41 IST)

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు: హరీష్‌రావు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖపై రాష్ట్ర మంత్రి హరీష్‌రావు స్పందించారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఏం లేఖ రాసిందో తనకు తెలియదన్నారు. కానీ, లేఖలో మా ముఖ్య కార్యదర్శి మాత్రం సరైన జవాబు రాశారని చెప్పారు. 
 
శ్రీశైలం పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి రావాల్సిన 54 శాతం విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ ద్వారా 60 టీఎంసీల నీటిని తీసుకెళ్లారని హరీష్ రావు తెలిపారు. 
 
ఇకపోతే.. విద్యుత్ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని, సమస్య పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణ రైతుల పంటలు కాపాడటం తమ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలా? వద్దా? అనే దానిపై తెలంగాణ టీడీపీ నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఎవరు కారణమో కూడా విపక్ష నేతలు చెప్పాలని అన్నారు.