శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (09:01 IST)

జంటనగరాలపై జలఖడ్గ ధారలు.. నైరుతి కుమ్ముడుతో చిగురుటాకులా వణికిన మహానగరం

హైదరాబాద్‌కు మూడురోజుల్లో రెండో సారి చిల్లుపడింది. నైరుతి రుతుపవనాలు వస్తూ వస్తూ నగరంపై కుండలతో వర్షాన్ని కుమ్మరించాయి. గురువారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా మొదలైన వర్షం దెబ్బకు మహా

హైదరాబాద్‌కు మూడురోజుల్లో రెండో సారి చిల్లుపడింది. నైరుతి రుతుపవనాలు వస్తూ వస్తూ నగరంపై కుండలతో వర్షాన్ని కుమ్మరించాయి. గురువారం తెల్లవారు జామున  3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా మొదలైన వర్షం దెబ్బకు మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. ఉదయం 8 గంటలవరకు అంటే 5 గంటలపాటు  జల ఖడ్గధారలతో హైదరాబాబ్ అల్లాడిపోయింది. దాదాపు ఏడు నెలల తర్వాత నిలగురిసిన వర్షం దెబ్బకు హైదరాబాద్ చల్లబడిపోయింది.
 
భారీ వర్షంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్‌, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, పాతబస్తీ, మలక్‌పేట, అబిడ్స్, మూసారంబాగ్‌, జూబ్లీహిల్స్ లోని పలు ఏరియాలలో భారీ వర్షం కురిసింది.
 
ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పలుప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి దారులు జలమయమయ్యాయి. దీంతో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.
 
హైదరాబాద్‌ నగరానికి ప్రతిరోజు ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బస్సులు వస్తుంటాయి. అవన్నీ ఉదయం ఆరు గంటలకే గమ్యస్థానాలకు చేరిపోతుంటాయి. అయితే తెల్లవారుజామున 3 గంటలకే వర్షం ప్రారంభం కావడంతో రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, మూసాపేట ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నుంచి ప్రవహిస్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
 
ఒక రోజు  భారీవర్షం దెబ్బకే అతలాకుతలమైన నగరం ఎన్ని మరమ్మత్తులు చేస్తే విశ్వనగరం కాగలుగుతుందో  మరి.