శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (14:47 IST)

తెరాస టిక్కెట్ ఇచ్చినా.. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినా పోటీ చేయను : జి వివేక్

పెద్దపల్లి లోక్‌సభ మాజీ సభ్యుడు, టీ కాంగ్రెస్ నేత జి వివేక్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని తెగేసి చెప్పారు. అలాగే వరంగల్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికార పార్టీ తెరాస టిక్కెట్ ఇచ్చినా సరే, ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా సరే తాను పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 
 
ఆయన సోమవారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి ఏ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చినా పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కోరినా తాను రంగంలోకి దిగేదిలేదని ఆయన అన్నారు. 
 
పనిలోపనిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ అణచివేయాలని చూశారన్నారు. తనపై వ్యక్తిగతంగా ఆయన కక్ష గట్టారని వ్యాఖ్యానించారు. టి.కాంగ్రెస్ నాయకత్వంపై సీమాంధ్రత నేతల ప్రభావం ఉందని అన్నారు. దళితుడు సీఎం అయితేనే సంపూర్ణ తెలంగాణ సాకారమవుతుందని వివేక్ చెప్పుకొచ్చారు.