శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (15:56 IST)

మెదక్ లోక్‌సభ బైపోల్ : "రెడ్డి" వర్గం నేతలే : ముగ్గురూ ఉద్ధండులే!

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తర పోరును తలపించేలా ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ముగ్గురు రెడ్డి కులానికి చెందిన వారు కావడమేకాకుండా, మంచి ఉద్ధండులు కావడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి సోని ట్రావెల్స్ అధినేత, కోటీశ్వరుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుండి ప్రభుత్వ మాజీ విఫ్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో సునీతా లక్ష్మారెడ్డి సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన అభ్యర్థుల తరపున తమ అనుచరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. 
 
బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి...
మెదక్ అభ్యర్థిగా జగ్గారెడ్డి పేరును అధికారికంగా ప్రటించేందుకు బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. చివరకు కాంగ్రెస్ నుంచి బుధవారం ఉదయం పార్టీలో చేరిన జగ్గారెడ్డికి మధ్యాహ్నానికి లోక్‌సభ బైపోల్ టిక్కెట్‌ను కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్‌లో జిల్లాలో పార్టీ కేడర్‌ను పెంచుకోవడంతోపాటు, టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు దూకుడుగా వ్యవహరించే నేత కావాలని ఆలోచించి జగ్గారెడ్డిని బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గారెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు. 
 
 
కాంగ్రెస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి.. 
ముందుగా ఊహించినట్లుగానే సునీతా లక్ష్మారెడ్డి ఏఐసీసీ వైపు మొగ్గు చూపింది. గత ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన ఆమె ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1999 నుండి మూడుసార్లు నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె జిల్లాలో అందరితో సఖ్యతగా ఉండటం ఒకటైతే మహిళ నేత కావడం పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఉద్యమ సమయంలో కూడా ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా తెలంగాణవాదాన్ని వినిపించారన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో ఉండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 
 
టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి.. 
దుబ్బాక నియోజకవర్గానికి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి 2010లో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈయన సోని ట్రావెల్స్ అధినేత. తెలంగాణాల్లో ఉన్న ధనికుల్లో ఒకరు. ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి చూపినప్పటికీ ఆయన టిక్కెట్ దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆయనను కేసీఆర్ సర్ది చెప్పడంతో మిన్నకుండి పోయారు. అదేసమయంలో గజ్వేల్ నియోజకవర్గం కీలకమైన గజ్వేల్ పట్టణ, మండల ఎన్నికల ఇన్‌ఛార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తీరా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం వచ్చిన ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే సమర్థుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అయితేనే బెస్ట్ అని కేసీఆర్ భావించినట్టుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇచ్చారు.