శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (10:35 IST)

తండ్రికి 'గ్రేటర్‌'ను కానుకగా ఇచ్చిన కేటీఆర్.. తనయుడికి కేసీఆర్ కానుక.. ఏంటది?

హైదరాబాద్ నగర పాలక సంస్థపై గులాబీ గులాబీ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. తాను ప్రకటించినట్టుగానే గ్రేటర్ హైదరాబాద్‌పై గులాబీ జెండాను ఎగురవేసి తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇచ్చారు. దీనికి ప్రతిగా ఆయన మరో కీలక శాఖను దక్కించుకున్నారు. గ్రేటర్‌ను తనకు కానుకగా ఇచ్చిన తనయుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చెప్పినట్లుగానే మున్సిపల్‌ శాఖను అప్పగించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌, ఐటీ శాఖలను నిర్వహిస్తున్న తారక రామారావుకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలను అప్పగించారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
వెంటనే ఈ జీవోను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఆదివారం ఉదయం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ జీవో ఓపెన్ అయింది. మధ్యాహ్నం కేబినెట్‌ సమావేశం ఉండడంతో కొద్దిసేపటికే జీవోను 'కాన్ఫిడెన్షియల్'గా మార్చారు. దాంతో సాయంత్రం వరకు జీవో ఓపెన్ కాలేదు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జీవో అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాగా, గ్రేటర్‌ ఎన్నికల బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌మంత్రి కేటీఆర్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఎలాగైనా గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగిరేలా కష్టపడాలంటూ ఆయనకు సూచించారు. ఆ మేరకు కేటీఆర్‌ నగరంలో విస్తృతంగా ప్రచారం సాగించి, విజయబావుటా ఎగురవేశారు.