శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (06:48 IST)

తెలంగాణాలో మరో రైతుబిడ్డ ఆత్మహత్య.. ఫీజు చెల్లించలేక ఫ్యానుకు ఉరేసుకుని...

తెలంగాణ రాష్ట్రంలో రైతులతో పాటు.. రైతు బిడ్డలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, వర్షాలు పడక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారి పిల్లలు మాత్రం కాలేజీలో ఫీజులు చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో రైతు బిడ్డ కాలేజీ ఫీజు చెల్లించలేక ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాలమూరు జిల్లా మన్సూరాబాద్‌లో ఈ  సంఘటన జరిగింది. ఈ వివరాలు పరిశీలిస్తే.. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామానికి చెందిన వాకిటి పొలంపల్లి అనే వ్యక్తికి ఎకరం పొలమే జీవనాధారం. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈయన కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. అరకొరగా సేద్యం చేసినట్టే.. కుమారుల చదువులూ సవ్యంగా సాగలేదు. పెద్దకుమారుడు నాగేందర్‌ ఎలాగో డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో నిమగ్నమయ్యాడు. 
 
రెండో కుమారుడు శివకృష్ణని వెంట పెట్టుకొని తల్లి జయమ్మ హైదరాబాద్‌కు వచ్చింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చేర్చి.. దగ్గరుండి చదివించుకుంటూ పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. వ్యవసాయం వెక్కిరించినా కొడుకు చదువు ఆగరాదని జయమ్మ రేయింబవుళ్లు శ్రమిస్తోంది. 
 
ఈ క్రమంలో నగరంలో బతకడం అంత సులభం కాదని అర్థమైపోయింది. పైగా ఇంటి నుంచి వచ్చే సాయం కూడా ఆగిపోయింది. దీంతో చిన్నకృష్ణ ఫీజు చెల్లించలేక పోయాడు. 'పది రోజుల్లో ఫీజు కట్టాలి. లేదంటే..' అంటూ కాలేజీ యాజమాన్యం శివకృష్ణపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఆ విషయాన్ని ఇంట్లో తల్లికి గానీ, ఊళ్లోని తండ్రికి గానీ చెప్పలేదు. అదీ ఇదీ అంటూ వారం రోజుల పాటు సాగదీశాడు. 
 
ఇదేసమయంలో పండగలు రావడంతో జయమ్మకు కొడుకు మీద అనుమానం రాలేదు. సోమవారం ఎప్పటిలాగే ఇళ్లలో పనులు తల్లి వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి కొడుకు ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించాడు. చదువు అర్థంతరంగా ఆగిపోతున్నదని లోలోపల కుమిలిపోయిన శివకృష్ణ ప్రాణం అప్పటికే గాలిలో కలిసిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవల అప్పుల్లో కూరుకుపోయిన తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టలేకపోవడం, దానిపై యాజమాన్యం తీవ్రంగా అవమానించడంతో నిజామాబాద్‌లో సంతోష్‌రెడ్డి అనే పదో తరగతి విద్యార్థి రైలు కింద పడిన విషయం తెలిసిందే. ఇది పెద్ద కలవరం రేపిన విషయం తెల్సిందే. ఈ విషాదంపై టీ సర్కారు విచారణకు ఆదేశించింది.