శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (12:50 IST)

కేసీఆర్ మాయలో పవన్ కల్యాణ్.. చేసిందంతా కాంగ్రెస్సే

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన పవన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ మాఫ

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన పవన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ మాఫియాను కాపాడేందుకే కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ కలిశారని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నానా కష్టాలు పడుతున్నారని... వపన్ కు దమ్ముంటే, తనతో పాటు వస్తే రైతుల వద్దకు తీసుకెళ్తానని వీహెచ్ సవాల్ విసిరారు. డ్రగ్స్ పెడ్లర్ కాల్విన్‌పై ఛార్జీషీట్ ఎందుకు వేయలేదో ప్రభుత్వం తెలపాలని వీహెచ్ అడిగారు. 
 
దేశానికే తెలంగాణ ఆదర్శమని పవన్ అన్నారన్న వీహెచ్, ఏ విషయంలో ఆదర్శమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో కేసీఆర్, పవన్‌లు కలసినప్పుడే తనకు డౌట్ వచ్చిందని తెలిపారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పడిపోయారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సెటైర్లు విసిరారు. విద్యుత్ సంస్థలను రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిస్తే... తెలంగాణకు 42 శాతం వాటా మాత్రమే వస్తుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రం చీకటిలో మగ్గిపోతుందని కిరణ్ చెప్పారని గుర్తు చేశారు.
 
అయితే, కాంగ్రెస్ నేతల కృషితో జనాభా ప్రకారం కాకుండా, వినియోగం ప్రకారం విద్యుత్ సంస్థల విభజన జరిగిందని చెప్పారు. హైదరాబాదులో ఐటీ సంఖ్యలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో, వాటికి అంతరాయం కలగకుండా, నగరంలో 24 గంటలపాటు విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఎక్కువ శాతం విద్యుత్ సంస్థలను కేటాయించారని చెప్పారు. ఈ విషయాలను పవన్ కల్యాణ్ గమనించలేకపోయారన్నారు. 
 
ఉమ్మడి ఆంధ్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ఎన్నో చర్యలను చేపట్టారని, కొత్త ప్రాజెక్టును ప్రారంభించారని రేవంత్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల కృషితోనే తెలంగాణలో మిగులు విద్యుత్ సాధ్యమయిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.