శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (12:48 IST)

యాదగిరిలో రాష్ట్రపతి: ప్రణబ్ వెంట అభిజిత్.. పూర్ణకుంభంతో స్వాగతం

యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టకు రాష్ట్రపతితో పాటు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఆలయానికి వచ్చారు. యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌తో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్‌లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
 
ఇటీవలే తిరుమల వెంకన్నను దర్శించుకున్న ప్రణబ్ కుమారుడు అభిజిత్ అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక యాదగిరిగుట్టకు కూడా అభిజిత్ తన తండ్రితో పాటే వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
 
ఇకపోతే.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని పోలీసు బలగాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. శనివారం రాత్రికే గుట్టపై భక్తులను పోలీసులు ఖాళీ చేయించేశారు. ఆదివారం మధ్యాహ్నం దాకా గుట్ట ఆలయంలో స్వామివారి దర్శనం, ఇతర సేవలన్నీ బందయ్యాయి. గుట్టపై ఉన్న దుకాణాలను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో ప్రస్తుతం గుట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.