ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (15:49 IST)

ఎవరి ఓట్లు అక్కర్లేదు.. నిరుద్యోగుల ఓట్లతోనే 90 సీట్లు గెలుస్తాం : రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నిరుద్యోగుల ఓట్లతోనే 90 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని ఆయన అధికార భారసా అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు పిలుపునిచ్చారు. ఇందుకోసం హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద  ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. ఇందుకోసం ఆయన గన్‌పార్కుకు రాగా, రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "డబ్బు పంచకుండా, చుక్క మందు పోయకుండా ప్రజలను ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్‌కు లేదు. గురివింద నలుపు ఎరగదన్నట్టు… వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా డబ్బు, మందు పంచకుండా మ్యానిఫెస్టోతో ఓట్లడుగుదామంటే కేసీఆర్ తోకముడిచాడు. అమరుల స్థూపం దగ్గర ప్రమాణం చేసే దమ్ము కేసీఆర్‌కు లేదు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నాడని తేలిపోయింది. తెలంగాణమా అప్రమత్తంగా ఉండు" అని పిలుపునిచ్చారు.
 
తాను 30 లక్షల మంది నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నానని మీ ఓటు, మీ కన్నతల్లిదండ్రుల ఓట్లు కలుపుకుంటే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లు అవుతాయన్నారు. ఈ ఓట్లు పడితే చాలు 90 సీట్లు వస్తాయని పిలుపునిచ్చారు. ఇక ఎవరి ఓటు అవసరం లేదన్నారు. మీ ఓటు వేసి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితే చాలన్నారు. కాబట్టి నిరుద్యోగులే కథానాయకులై, మీరు కదనరంగంలోకి దిగి మీరే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలన్నారు. ఆ తర్వాత యేడాదిలో 2 లక్షల ఉద్యోగులను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినపుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు రంగంలోకి దిగితేనే తెలంగాణా వచ్చిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దన్నారు. అందుకే ఈ 45 రోజులు ప్రతి నిరుద్యోగి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.