శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (17:46 IST)

మామా - అల్లుళ్ళ సభగా తెలంగాణ అసెంబ్లీ : రేవంత్ రెడ్డి

మామా, అల్లుళ్ళ సభగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మారిపోయిందని టీ టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ నుంచి ప్రతిపక్ష సభ్యలను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. మామ, అల్లుడు శాసనసభను ఆటవిడుపు కేంద్రంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ఉద్యమిస్తామన్నారు. 1400 మంది రైతు కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. 
 
మిగిలిన రుణమాఫీని వెంటనే చేయాలన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి రైతు రుణాలు మాఫీ చేసేందుకు డబ్బు లేదా అని రేవంత్ ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం రూ.40 వేల కోట్ల టెండర్లు పిలిచారు కానీ... రైతులకు సాయం చేయడానికి డబ్బు లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం మెడలు వంచి... ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి రైతులకు రుణవిముక్తి కల్పించే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. 
 
రైతు సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం అణగదొక్కటం అన్యాయమన్నారు. సభలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రైతులను ఆదుకోమంటే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. మామా అల్లుళ్లు కలసి సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. అందరితో చర్చించాక అవసరమైతే రేపు తెలంగాణ బంద్ చేస్తామని హెచ్చరించారు. 
 
సీఎం, మంత్రులను నిలదీస్తామని... వారి పర్యటనలను అడ్డుకుంటామన్నారు. తమ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని... జెండాలకు అతీతంగా ప్రతిపక్షాలు కలికట్టుగా పోరాటం చేస్తామని ప్రకటించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, 1400 మంది ఆత్మహత్య చేసుకుంటే 400 అని చెప్పడం తగదని రేవంత్ రెడ్డి హితవు పలికారు.