శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (14:57 IST)

రేవంత్‌కు ఒక్క రోజులో బెయిల్ రాలేదు.. 30 రోజులు జైల్లో ఉన్నారుగా... రద్దు కుదరదు : సుప్రీంకోర్టు

ఓటుకు నోటు కేసులో హైకోర్టు బెయిల్‌పై విడుదలైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మళ్లీ కస్టడీలోకి తీసుకుని ఏం చేస్తారని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ తరపున హాజరైన అడ్వకేట్‌ను ప్రశ్నించింది. రేవంత్ వాంగ్మూలాన్ని సెక్షన్ 164 కింద నమోదు చేశారని గుర్తు చేసింది. పైగా రేవంత్ రెడ్డికి ఒక్క రోజులోనే బెయిల్ రాలేదనీ, 30 రోజుల తర్వాత వచ్చిందని తెలిపింది. ఒకవేళ రేవంత్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే అపుడు కోర్టు తలుపు తట్టండని, అప్పటి వరకు బెయిల్ రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైనట్టు అయింది. 
 
ఈ కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ గురువారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై శుక్రవారం చీఫ్ జస్టీస్ దత్తు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపి ఏసీబీ పిటీషన్‌ను కొట్టేసింది. టీ.ఏసీబీ తరపున వాదించేందుకు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, హరీష్ సాల్వే, దుష్యంత్ దవే వంటి దిగ్గజాల్లాంటి సీనియర్ లాయర్లను రంగంలోకి దించగా, రేవంత్ రెడ్డి తరపున మరో సీనియర్ లాయర్ రాంజెఠ్మలానీ వాదించారు.