శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 17 సెప్టెంబరు 2014 (19:08 IST)

భరతనాట్య కళాకారిణి శుభాన్వితకు కేంద్ర ప్రభుత్వ సిటిఎస్ఎస్

జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో భరతనాట్యం, కూచిపూడి నృత్యంలో పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న చిరంజీవి ఎస్. శుభాన్విత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ (సి.టి.ఎస్.ఎస్.) 2014కు ఎంపికయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ ట్రైనింగ్ (సి.సి.ఆర్.టి.) దేశ వ్యాప్తంగా వివిధ కళా రంగాలలో కృషి చేస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.  
 
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి, అభినయ కళారత్న శ్రీమతి గీతా గణేశన్ శిష్యురాలైన శుభాన్విత భరతనాట్యం నుండి ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యింది. తన గురువు గీతా గణేశన్ ఇచ్చిన శిక్షణ, ఆమె తల్లిగారైన స్వర్గీయ రాజం గణేశన్ ఆశీస్సులతో ప్రతిష్ఠాత్మకమైన ఈ స్కాలర్‌షిప్‌కు తాను ఎంపికయ్యానని శుభాన్విత తెలిపింది. సోమేసుల బాలసుబ్రహ్మణ్యం, సుహాసినీ దంపతుల కుమార్తె అయిన శుభాన్విత ప్రస్తుతం బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, దిల్‌సుఖ్‌నగర్ శాఖలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. 
 
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సి.సి.ఆర్.టి. సంస్థ భరతనాట్యంలో శిక్షణకే కాకుండా, శుభాన్విత డిగ్రీ చదువు పూర్తయ్యే వరకూ ఎకడమిక్ ఎడ్యుకేషన్ కోసం కూడా కొంత మొత్తాన్ని ఈ స్కాలర్‌షిప్ ద్వారా అందిస్తుంది.