శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (12:18 IST)

తెలంగాణాలో స్వైన్ ఫ్లూతో ఒకరి మృతి.. ఐదుగురు జూడాలకు స్వైన్ ఫ్లూ!

రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ వైరస్ మరింతగా విజృంభిస్తోంది. తాజాగా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో మంగళవారం ఉదయం ఓ మహిళ మృతి చెందింది. ఘటకేసర్‌ మండలం ఏదులాబాద్‌కు చెందిన శైలాజ స్వైన్‌ ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. వెంటనే దహనసంస్కారాల కోసం శైలజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లగా గ్రామస్థులు పట్టించుకోక పోవడం ఆ కుటుంబాన్ని మరింత ఆవేదనకు గురి చేసింది. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి రాజయ్యను బర్తరఫ్ చేసినప్పటికీ.. స్వైన్ నివారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నష్టనివారణ చర్యలు ఏమాత్రం ఫలితం చూపడం లేదు. సోమవారం స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు మరణించడంతో అధికారిక లెక్కల ప్రకారమే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. 
 
మొత్తమ్మీద జనవరి నెలలో 1050 మంది రోగులకు స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది, ఒక్క సోమవారం నాడే 105 మందికి పరీక్ష చేయగా 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. వీరిలో ఐదుగురు డాక్టర్లు కూడా ఉండటం గమనించాల్సిన అంశం. ఇంతకుముందు నలుగురు జూనియర్ డాక్టర్లకు కూడా స్వైన్ ఫ్లూ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పిల్లలకు కూడా స్వైన్ఫ్లూ సోకింది. దీంతో వీరందరినీ ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.