గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (10:00 IST)

పువ్వాడకు పరీక్ష... కొడుకా.. కూటమా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు, దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలోవున్న కమ్యూనిస్టు (సీపీఐ) నేతల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న పువ్వాడ నాగేశ్వర రావు పరిస్థితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా మారింది. ఆయన పరిస్థితి ఇలా ఎందుకు తయారైందో ఓసారి పరిశీలిస్తే, 
 
సీపీఐలో అనేక కీలక పదవులను నిర్వహించిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర రావు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, జాతీయ పార్టీ సభ్యుడిగా మాత్రం కొనసాగుతున్నారు.
 
అయితే, ఆయన కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 
 
అదేసమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటైంది. ఈ కూటమి తరపున టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. దీంతో పువ్వాడ నాగశ్వర రావు పరిస్థితి విచిత్రంగా తయారైంది. 
 
మహాకూటమి తరపున నామా నాగేశ్వర రావు పోటీ చేస్తుండటంతో ఆయన తరపున ప్రచారం చేయాల్సిన నిర్బంధ పరిస్థితి పువ్వాడకు ఏర్పడింది. అదేసమయంలో ఆయన కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
దీనికితోడు పువ్వాడను ఎలాగైనా ప్రచారానికి రప్పించాలన్న పట్టుదలతో మహాకూటమి నేతలు ఉన్నారు. దీంతో పువ్వాడ ఎటువైపు మొగ్గుతారోనన్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు.