శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (15:40 IST)

తెలంగాణ కలలు భగ్నమయ్యాయి : పౌర సంఘాల నేతలు!

తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎంతో ఆనందించామని, ఇప్పుడు, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు వైఖరితో కలలు భగ్నమయ్యాయని ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించతలపెట్టిన సదస్సుకు పోలీసులు అనుమతించకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ లభించలేదని హరగోపాల్, పొత్తూరి, చుక్కా రామయ్య ఆరోపించారు. 
 
మరో నేత ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ, గత 40 ఏళ్ళలో ఇంతటి నిర్బంధాన్ని ఎప్పుడూ చూడలేదని, సభ పెట్టుకోవడానికి హోం మంత్రి అనుమతి ఇచ్చినా, పోలీసులు నిరాకరిస్తున్నారని చెప్పారు. సదస్సు నేపథ్యంలో వరవరరావు, కల్యాణ్ రావు, జితేన్ మరాండీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. 
 
రాజకీయ ప్రత్యామ్నాయం పేరుతో విరసం నేతలు తలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సభకు అనుమతి లేదంటూ విరసం నేత వరవరరావు సహా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
 
మరోవైపు విరసం నేతలను అరెస్టు చేసిన విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు క్యాంప్‌ ఆఫీసుకు బయలుదేరిన పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రఘునాథ్‌లను పోలీసులు మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇంటికి తరలించారు. తర్వాత హరగోపాల్‌ పోలీసు కమీషనర్‌ మహీందర్‌రెడ్డిని కలిసి అరస్టులపై నిరసన తెలిపారు.