శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (14:14 IST)

కేసీఆర్ చైనా పర్యటనకు రూ.2 కోట్ల అద్దెతో ప్రత్యేక జెట్ ఫ్లైట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈనెల 8వ తేదీ నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలోని డాలియన్ సిటీ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొననున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయనతో పాటు ప్రత్యేక ప్రతినిధి బృందం చైనాకు వెళ్లనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక జెట్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం అవసరమైన రూ.2 కోట్ల నిధులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల కూడా చేసింది.
 
 
నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతోంది. ముఖ్యంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం వేలాది కోట్ల రూపాయలు అవసరం కూడా. ఇదే విషయంపై నీతి ఆయోగ్ అధ్యక్షుడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘ లేఖరాశారు. ఈ లేఖలో తమకు అదనంగా నిధులను కేటాయించాలని, ఈ నిధులను కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసమే ఖర్చు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ లేఖ రాసిన తర్వాత అంటే సరిగ్గా మూడు రోజులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చైనా పర్యటన కోసం ప్రత్యేక జెట్ విమానాన్ని అద్దెకు తీసుకునేందుకు రూ.2,03,84,625ను విడుదల చేసింది. 
 
ఈ సూపర్ లగ్జరీ సీఆర్జే 100 ఎయిర్‌క్రాప్ట్‌ అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఏఆర్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు... మొత్తం 50 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ జెట్‌లో ఫ్లష్ ఇంటీరియర్స్, లెదర్ సీట్స్, సోఫా, ఎంటర్‌టైన్మెంట్ సెంటర్, శాటిలైట్ ఫోన్, డీవీడీ, మూడ్ లైటింగ్, ఎల్‌సీడీ స్క్రీన్స్ ఉన్నాటి. రెండు ఇంజన్లు కలిగిన ఈ బిజినెస్ క్లాస్ ఫ్లెట్‌లో ఉన్న లగ్జరీ సీట్లు 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. అలాగే, ఓ వైపు అతిథులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. డైనింగ్ కూడా వినియోగించుకోవచ్చు. భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన బిజినెస్ క్లాస్ స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇదే కావడం గమనార్హం. 
 
ఇలాంటి విమానాన్ని ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అద్దెకు తీసుకున్నారు. అయితే, వరల్డ్ ఎకనామికి ఫోరం సదస్సు మాత్రం 9 నుంచి 11వ తేదీల మధ్య జరుగనుంది. ఈ సదస్సుకు వెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పరిశ్రమల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ మంత్రి కేటీఆర్, మరికొంతమంది మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.