శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR

ఏపీ ఆర్టీసీ బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే.. టీ ఆస్తులన్నీ మావే : మంత్రి మహేందర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే విధిగా ఎంట్రీ ట్యాక్స్‌ను చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఈ పన్నును వసూలుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇకపోతే.. తెలంగాణా రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులన్నీ టీఎస్ ఆర్టీసీకే చెందుతాయన్నారు.
 
ఆస్తుల విషయంలో ఏపీ మంత్రితోపాటు కార్మికులకు కూడా స్పష్టత ఉందన్నారు. ప్రస్తుత పర్మిట్ల కాలపరిమితి ముగియగానే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సుల మాదిరిగానే ఏపీ బస్సులకు కూడా పన్ను విధిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని చూస్తుందన్నారు.
 
ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారని, ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయడంలో ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ 44 శాతం ఇచ్చారని అన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీనీ లాభాల్లోకి తెచ్చుకుందామని సూచించారు. 
 
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో బస్సు చార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. డీజీల్ రేటు అనేకసార్లు పెరిగినా రెండేండ్లుగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్నారు. మే 28న ఆర్టీసీ తాత్కాలిక విభజన జరుగుతుందని, త్వరలోనే కేంద్రం నుంచి విభజనకుఅధికారిక ఉత్తర్వులు వస్తాయని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన రూ.150 కోట్లతో 500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.