శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (11:28 IST)

ఎంపీ పదవి కేసీఆర్ వేసి భిక్ష.. అదృష్టంగా భావిస్తున్నా : వరంగల్ ఎంపీ

వరంగల్ ఎంపీ పదవి తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్ష అని లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన పసునూరి దయాకర్ అన్నారు. ఎంపీగా ఎన్నికైన రెండు రోజులకే ఆయన లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసి, పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టానట్టు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చానని, తాను కోరకపోయినా కేసీఆర్ అవకాశం ఇచ్చి వరంగల్ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. 
 
పార్లమెంట్ సభ్యుడినవుతాననిగానీ, కావాలనిగానీ తాను కోరుకోలేదని, కేసీఆర్ చలువతో, వరంగల్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కార్యకర్తగా పనిచేసిన తాను పార్లమెంట్ సాక్షిగా బిల్లుపై చర్చ అనంతరం ఆమోదం పొందడాన్ని టీవీల్లో చూశానే తప్ప, ఎప్పుడూ పార్లమెంట్ ఆవరణలోకి రాలేదన్నారు. ఇప్పుడు ఒక ఎంపీగా తెలంగాణ బిల్లును పాస్ చేసిన సభలో అడుగుపెట్టడం మరిచిపోలేని అనుభూతికి లోనవుతున్నట్టు చెప్పారు. 
 
ఎంతో అనుభవం ఉన్న సీనియర్ సభ్యులతోపాటు పార్లమెంటులో కూర్చోవడం ఒక అదృష్టమని, అది కేసీఆర్ వల్ల, వరంగల్ ప్రజల వల్ల సాధ్యమైందని అన్నారు. వరంగల్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ఇప్పుడు తనమీద ఉన్న కర్తవ్యమన్నారు. పార్లమెంటుకు కొత్త వ్యక్తినైన తాను ఇప్పుడు సీనియర్ ఎంపీల అనుభవాల బాటలో పయనించాల్సి ఉన్నదని, వారి సహాయ సహకారాలే తనకు వెన్నుదన్ను అని చెప్పుకొచ్చారు.