మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (14:46 IST)

వివాదాల "పద్మావతి"... ఇప్పట్లో రిలీజ్ లేనట్టే...

చరిత్రను వక్రీకరించారంటూ తీవ్రనిరసనలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' ఈ యేడాది రిలీజ్ లేనట్టే. ఈ చిత్రం విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు.

చరిత్రను వక్రీకరించారంటూ తీవ్రనిరసనలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' ఈ యేడాది రిలీజ్ లేనట్టే. ఈ చిత్రం విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. పైగా ఇప్పుడు చరిత్రకారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
బాలీవుడ్ దర్శకదిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం వాస్తవానికి డిసెంబర్ ఒకటో తేదీనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్ కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, చిత్ర యూనిట్‌కు వార్నింగ్ ఇచ్చింది. అదేసమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాయి. దీంతో చిత్రం విడుదలను వాయిదా వేశారు. 
 
అయితే, గుజరాత్ ఎన్నికల తర్వాత మూవీకి క్లియరెన్స్ వస్తుందని భావించిన చిత్ర యూనిట్‌కు తీవ్ర నిరాశ కలిగించింది. పాక్షికంగా చరిత్రలోని అంశాల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు సీబీఎఫ్‌సీకి చేసిన దరఖాస్తులో చెప్పి.. పద్మావతి మూవీ మేకర్స్ పెద్ద తప్పు చేశారని బోర్డులోని ఓ సభ్యుడు వ్యాఖ్యానించారు. దీనివల్ల ఇప్పుడు సినిమాలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
 
అంతకుముందు ఈ సినిమా ఓ కల్పితమా? లేక చరిత్ర ఆధారంగా తీశారా? అన్న కాలమ్‌లో ఏమీ రాయకుండా పంపడంతో సీబీఎఫ్‌సీ దానిని తిప్పి పంపించింది. అల్లావుద్దీన్ ఖిల్జీతో రాణి పద్మిణి రొమాన్స్ చేసినట్లు సినిమాలో చూపించారని రాజ్‌పుత్‌లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక పద్మావతి కంటే ముందు ఇంకా 40 సినిమాలకు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉండటంతో.. సీబీఎఫ్‌సీ ఇక జనవరిలోనే ఈ మూవీని చూసే అవకాశం ఉందని బోర్డులోని ఓ సభ్యుడు తెలిపారు.
 
అసలు 'పద్మావతి' చిత్ర కథను పరిశీలిస్తే, దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రాల్లో ఇది ఒకటి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం నుంచి వివాదాలు అలుముకున్నాయి. ఈ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరిస్తున్నారని రాజ్‌పుత్‌ వర్గీయుల్లోని కర్ణిసేన అనే వర్గం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. దీనికితోడు ఈ వివాదానికి రాజకీయరంగు పులుముకుంది. ఫలితంగా ఈ చిత్రానికి సెంట్రల్ సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 
ఈ చిత్రం కథ ఎలా ఉన్నప్పటికీ.. చరిత్రలో అసలు పద్మావతి అనే రాణి ఉందా? లేదా? అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ పద్మావతి జీవితంపై ఒక్కో కవి ఒక్కోవిధంగా రాశాడు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాలిక్ మహ్మద్ జయాసీ అనే సూఫీ రచయత 1540లో రాసిన పద్మావతి అనే రచన ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.
 
ఈ రచన ప్రకారం శ్రీలంక(సింహాల)రాజు గంధర్వ్ సేన్. ఈయనకు అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరే పద్మావతి. ఆమె చెంత ఎల్లవేళలా మాట్లాడే చిలుక ఒకటి ఉండేది. చిలుక అంటే పద్మావతికి అమితమైన ప్రాణం. పైగా, పద్మావతి ఎప్పుడూ ఈ చిలుకతోనే ఉండేది. దీంతో ఆమె తండ్రి గంధర్వ్ సేన్‌కు ఓ రోజున కోపం వచ్చి చిలుకను చంపాలని చూస్తాడు. కానీ ఆ చిలుక తప్పించుకొని ఓ వేటగాడి చేతికి చిక్కుతుంది. అలా చిలుక చివరికి చిత్తోర్‌గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ దగ్గరకు చేరుకుంటుంది. అది మాట్లాడే చిలుకు కాబట్టి రాజు పద్మావతి అందం, గుణాలకు గురించి చిలుక రాజుకు చెబుతుంది. దీంతో రాజుకు పద్మావతిపై మోజుపడుతుంది. 
 
ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని మనసులోనే ఓ నిర్ణయానికి వస్తాడు. అయితే రతన్ సింగ్ అప్పటికే వివాహమై నాగ్‌మతి అనే భార్య ఉంటుంది. కానీ పద్మావతి దక్కించుకోవాలని కోరికతో రతన్ సింగ్ వెంటనే సింహాల రాజ్యంపై దండెత్తి గంధర్వ్ సేన్ రాజును ఓడిస్తాడు. దీంతో తన కూతురు పద్మావతిని రతన్ సింగ్‌కు ఇచ్చి వివాహాం జరిపిస్తాడు. రతన్ సింగ్, అతని మొదటి భార్య నాగ్‌మతిల మధ్య చిచ్చుపెట్టేందుకు రాఘవ్ చేతన్ ప్రయత్నిస్తాడు. విషయం తెలుసుకున్న రాజు అతన్ని రాజ్యం నుంచి వెలివేస్తాడు.
 
రాజ్యం నుంచి వెళ్లిపోయిన రాఘవ్.. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆశ్రయం పొందుతాడు. సుల్తాన్‌కు రాఘవ్ పద్మావతి గురించి, ఆమె అందాల గురించి వివరిస్తాడు. దీంతో ఖిల్జీ కూడా పద్మాతిపై మనసు పారేసుకుని చిత్తోర్‌గఢ్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ తర్వాత రతన్ సింగ్‌ను ఖిల్జీ బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకుని పద్మావతి రతన్ సన్నిహితులైన గోరా, బాదల్ సహాయంతో ఢిల్లీ వెళ్లి ఖిల్జీ‌పై యుద్ధం చేసి తన భర్తను కాపాడుకుంటుంది. ఇలా పద్మావతి చరిత్రను మాలిక్ మహ్మద్ జయాసీ రచించాడు. అలాగే, హేమ్‌రతన్‌ అనే కవి తన రచనలో మరోలా పేర్కొంటాడు. 
 
అయితే, ఈ చిత్రంలో పద్మావతి - ఖిల్జీకి మధ్య శృంగారంతో పాటు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్నది కర్ణిసేన ప్రధాన ఆరోపణగా ఉంది. వాస్తవను కథను వక్రీకరించి, కలెక్షన్ల కోసం ఖిల్జీ, పద్మావతి మధ్య ఈ తరహా సన్నివేశాలు సృష్టించారని వీరి ప్రధాన ఆరోపణ. అందుకే ఈ చిత్రం జగడాల సుడిగుండంలో చిక్కుకుంది.