శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:56 IST)

నిజమని నేను నమ్మిందే సినిమాగా తీసాను: వర్మ

ఒకప్పట్లో క్రైమ్.. దెయ్యం.. మాఫియా.. ఫారెస్ట్ నేపథ్యాల్లోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించి తనదంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకొని ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత వివాదాస్పదమైన కథాంశాలనే తన సినిమాలకి కథా వస్తువులుగా ఎంచుకుంటూ తనలోని మరో కోణాన్ని వెలికితీస్తున్నాడు. 
 
కాగా... ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా బెదరకుండా తెరపై తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రేక్షకుల మీదకు వదిలి పెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల థియేటర్‌లలోనూ రన్ అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూకి హాజరైన ఆయనకు... "లక్ష్మీపార్వతిపై ఎన్నో ఆరోపణలు వున్నాయి.. అలాంటి ఆమెను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఒక దేవతగా చూపించడానికి కారణమేమిటనే ప్రశ్న ఎదురైంది. అందుకు స్పందించిన ఆర్జీవీ.. "ఒకరికి ఫేవర్‌గా.. మరొకరికి వ్యతిరేకంగా ఈ సినిమా చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజాలను చెప్పడానికి మాత్రమే ఈ సినిమా తీసాను. లక్ష్మీపార్వతి అలా చేసిందట.. ఇలా చేసిందట అని 10 మంది పది రకాలుగా చెప్తారు. దేనికీ సాక్ష్యాధారాలు వుండవు. అలాంటి పుకార్లను నమ్మి సినిమాని తీయలేం. పరిశోధన చేసి.. నిజాలు అని నేను నమ్మిన వాటిని మాత్రమే సినిమాలో చూపించాను" అని చెప్పుకొచ్చారు.
 
ఏది ఏమైనప్పటికీ... ఈయనగారి సినిమాలో లక్ష్మీపార్వతిని మరీ మదర్ థెరిస్సాలా చూపించేసారని జనాలలో టాక్.