1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:23 IST)

ఒక మనిషి భద్రతకు నెలకు రూ.10 లక్షల ఖర్చు అవసరమా?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కేంద్రం "వై ప్లస్" కేటగిరీ భద్రతను కల్పించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, శివసేన నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తీవ్రవాదులు కూడా తమకు భద్రత కల్పించమని కోరితే కేంద్రం కల్పిస్తుందా అంటూ నిలదీశారు. దీనికి కారణంలేకపోలేదు. 
 
అయితే, కంగనాకు కల్పిస్తున్న భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు గుప్పించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. 
 
కంగనా రనౌత్ ఇపుడు ముంబైను వీడి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలీలో సురక్షితంగా ఉన్నారనీ, అందువల్ల సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. దీనిపై కంగనా స్పందించారు. తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు.