గురువారం, 14 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (11:50 IST)

'బుర్రిపాలెం బుల్లోడు' అసలు పేరేంటి? జీవిత నేపథ్యం...

krishna
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన కుుటుంబంతో పాటు తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణా జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 1942 మే 31వ తేదీన ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ తొలి సంతానం. 
 
కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదివే రోజుల్లోనే ఏలూరులో అక్కినేని నాగేశ్వర రావుకు ఘనంగా సన్మానించారు. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1956లో ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల అనే  సంతానం ఉన్నారు. ఆ తర్వాత హీరోయిన్ విజయనిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వీరికి హీరో నరేష్ సంతానం. 
 
ఆ తర్వాత 1964లో ప్రముఖ దర్శనిర్మాత ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన "తేనె మనసులు" సినిమాతో కృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే, ఆ సినిమాలో కృష్ణ నటన ఏమాత్రం బాగోలేదని, ఆయన్ను సినిమా నుంచి తొలగించాలని తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఈ చిత్రం 1965లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. 
 
కృష్ణ రెండో చిత్రం "కన్నెమనసులు", ఆ తర్వాత "గూఢచారి 116"లో అవకాశం లభించింది. అది కూడా ఘన విజయం సాధించింది. అక్కడ నుంచి కృష్ణ ఏమాత్రం వెనక్కి తిరిగిచూడలేదు. ఏకంగా 350కి పైగా చిత్రాల్లో నటించారు. "గూఢచారి 116" తర్వాత కృష్ణకు తెలుగు జేమ్స్‌బాండ్‌గా పేరొచ్చింది. ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన "సాక్షి" చిత్రం కృష్ణ ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. హీరోయిన్‌ విజయ నిర్మలతో కలిసి కృష్ణ నటించిన తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.