సుధీర్ బాడీని మరోసారి చూడాలనుంది - చాల్లేరా కథ చెప్పొద్దురా బాబూ అన్న ప్రభాస్
సహజంగా ప్రభాస్ తన స్నేహితులతో కలిసినప్పుడు సినిమా కథలు చర్చకు వస్తాయి. అలా మేం కూర్చుకున్నప్పుడు ఏదైనా కథ చెబితే, చాల్లే ఇంకా చెప్పొద్దురా బాబూ అంటాడు ప్రభాస్. కానీ ఈ సినిమాకు మాత్రం తర్వాత ఏం జరుగుతుంది? అంటూ అడిగి మరీ చెప్పించుకున్నాడని.. ప్రభాస్ స్నేహితుడు, శ్రీదేవి సోడా సెంటర్` నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా తెలియజేస్తున్నారు. ఈనెల 27న థియేటర్‌లో విడుదలకానున్న ఈ సినిమా గురించి ప్రభాస్‌తో మాటామంతీగా ప్రమోషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సుధీర్ బాబు, విజయ్, కరుణకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలు బహిర్గతమయ్యాయి.
ప్రభాస్ మాట్లాడుతూ, విజయ్, సుధీర్‌బాబు మంచి స్నేహితులం. షడెన్‌గా సుధీర్ బాడీ పెంచాడు. చూసి ఆశ్చర్యపోయాను. టీజర్ విడుదలయ్యాక ఆ బాడీ ఏమిటి? బోట్‌లోనుంచి రావడం ఏమిటి? టీజర్ చూశాక బోట్‌లో ఎలా వస్తావో మరలా చూడాలనుంది అంటూ వ్యాఖ్యానించారు.
ఇక బోట్ గురించి ఆ కథ గురించి నిర్మాత విజయ్ మాట్లాడుతూ, అమలాపురం పరిసర ప్రాంతాలైన కోటుపల్లి, ఎర్రగళ్లు అనే ప్రాంతంలో ఏడాదికొకసారి బోటు రేసు పెట్టుకుంటారు. అక్కడ పొలస చేప బాగా దొరికే ప్రాంతంలోనే రేస్ వుంటుంది. మత్సకారులు కొంతమంది అలా రేస్‌లో ఎవరైతే ముందుగా వెళతాడో వారిదే ఆ ప్రాంతం. ఇక్కడ బోటుకూడా చాలా చిన్నది. అదే కేరళలో జరిగే బోట్ రేస్‌కు మనకూ చాలా తేడావుంది. ఇలా బోట్ రేసు అనేది ఇంతవరకు ఏ సినిమాలోనూ చూపించలేదు అని చెప్పారు.
వెంటనే దర్శకుడు అందుకుని, ఆ రేసు చేయడం చాలా కష్టం. మొదట సుధీర్‌ను బాడీ పెంచమన్నాం. పెంచాక షూట్ చేద్దామని ఆ ప్రాంతానికి వెళితే సరిగ్గా ఆ టైమ్‌కు ఒరిజినల్ బోట్ రేసు జరుగుతుంది. అందుకే దాదాపు మూడున్నరనెలలు ఆగాల్సివచ్చింది. ఈలోగా వేరే షాట్స్ తీయాల్సివచ్చింది. అంటూ వివరించారు.
మరి రిస్క్ నీకేమైనా అనిపించిందా! అని సుధీర్‌ను ప్రభాస్ అడిగితే, కథ చెప్పినప్పుడే భయంకరంగా అనిపించింది. కొత్తగా వుందని ఒప్పుకున్నాను. బోట్‌రేసు చేసేటప్పుడు అవతలి బోటులో వెదురు బుట్టలు వుండే దానిమీద పడాలి. డూప్ చేస్తానంటే వద్దని చేశా. మేకులు గుచ్చుకున్నాయి. కాలికి దెబ్బతగిలింది.. అంటూ సుధీర్‌బాబు అనుభవాలు పంచుకున్నారు.
ఫైనల్‌గా, ప్రభాస్ మాట్లాడుతూ, కథంతా తెలుసు నాకు. చివరి 40 నిముషాలు చాలా కొత్తగా వుందనిపించిందని పేర్కొన్నాడు.