ఐటీ రంగంలో అదో మోసం... నేను కిడ్నాప్ అయ్యాను రివ్యూ...
నేను కిడ్నాప్ అయ్యాను సినిమా నటీనటులు: పోసాని కృష్ణమురళీ, బ్రహ్మానందం, కార్టూనిస్ట్ మల్లిక్, కృష్ణభగవాన్, వర్ధమాన నటీనటులు; సంగీతం: శ్రీకాంత్, నిర్మాత: మాధవి, దర్శకత్వం: శ్రీకరబాబు. దర్శకుడు శ్రీకరబాబు కొత్తవాడయినా సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే
నేను కిడ్నాప్ అయ్యాను సినిమా నటీనటులు: పోసాని కృష్ణమురళీ, బ్రహ్మానందం, కార్టూనిస్ట్ మల్లిక్, కృష్ణభగవాన్, వర్ధమాన నటీనటులు; సంగీతం: శ్రీకాంత్, నిర్మాత: మాధవి, దర్శకత్వం: శ్రీకరబాబు.
దర్శకుడు శ్రీకరబాబు కొత్తవాడయినా సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో సాగే ఓ పాయింట్‌ను తీసుకుని అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నమిది. పోసాని టైటిల్ రోల్‌తో తీసిన ఈ సినిమా నేడే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ :
జీవితంలో ఎదగాలనుకునే నలుగురు యువతీయువకులు రకరకాల కారణాలతో ఒకేచోట కలుస్తారు. అందులో జీవితంపై విరక్తిచెందిన ఓ వ్యక్తీ వుంటాడు. (వీరంతా కొత్త నటీనటులు). ఐటీ రంగంలో తమకు తాముగా ఎదగాలని ఓ సాఫ్ట్‌వేర్‌ను కనిపెడతారు. దాన్ని తనకు తెలిసిన ఓ స్నేహితురాలి ద్వారా ప్రముఖ ఐటీ కంపెనీ ఎం.డి. దూబే (పోసాని)తో చెప్పి తమకు సపోర్ట్‌గా వుంటాడని భావిస్తారు. వారి ప్రోజెక్ట్ చూసి ఔట్ డేటెడ్ ప్రాజెక్ట్ అంటూనే.. వారందరినీ తన దగ్గర పనిచేయమని ఆఫర్ ఇస్తాడు. అందరూ చర్చించుకుని పనిచేయడానికి సిద్ధమవుతారు. అయితే మూడు నెలలపాటు డెస్క్‌లోనే ఖాళీగా వుండేలా జీతం ఇచ్చేలా ప్లాన్ చేస్తాడు పోసాని.
ఈలోగా తను అమెరికా వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చాక అందరికీ పింక్ కార్డ్ ఇచ్చేస్తాడు. అంటే పనిలోంచి తీసేస్తాడు. పని చేయాలంటే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ కింద మీరంతా పనిచేయాలనీ.. ఓ ప్రాజెక్ట్ చూపిస్తాడు. అది వీరంతా కష్టపడి చేసిందే. దాంతో తాము దూబే చేతిలో మోసపోయామని ఎదురుతిరుగుతారు. దాంతో అందరినీ బయట గెంటిస్తాడు. అలా గెంటివేయబడ్డవారు ఏం చేయాలని తర్జనభర్జనలు పడి.. ఆఖరికి కిడ్నాప్ చేయాలనే నిర్ణయానికి వస్తారు. అదెలా చేశారు? ఆ తర్వాత ఏమయింది? అనేది సినిమా.
విశ్లేషణ :
దర్శకుడు తీసుకున్న పాయింట్ ఆసక్తిగా వుంది. ఇప్పటి ఐటీ కంపెనీలో జరుగుతున్న కొన్ని మోసాలను ఎత్తి చూపించాడు. ఐటీ కంపెనీలో జరిగే లోతు విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే వాటిని ఇంకాస్త చక్కగా ప్రెజెంట్ చేస్తే బాగుండేది. మొదటి భాగమంతా కొత్త నటీనటులంతా కలవడం, వారు చేసే పనులుతోనే సాగిపోతుంది. సెకండాఫ్‌లో వచ్చేసరికి కథ కొలిక్కి వస్తుంది. అక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్‌గా వుంది. దర్శకుడు కొత్తనటీనటుల్ని ఇంకాస్త కేర్ తీసుకుని చేసుంటే సినిమా మరోలా వుండేది.
పోసాని నటన చెప్పక్కర్లేదు. తను పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇక కిడ్నాప్ చేసే దాదాగా బ్రహ్మానందం నటించాడు. తను సీనియర్ అయినా.. ఈ పాత్రకు సరైన న్యాయం చేయలేదనే చెప్పాలి. 30 ఇయర్స్ పృథ్వీ లాయర్‌గా నటించాడు. రఘుబాబు అందరూ వుండే కాలనీ ప్రెసిడెంట్. అయితే తను చేసే కామెడీ అంతా మాస్ తరహాలో వుంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కార్టూనిస్ట్ మల్లిక్ పాత్ర సిబిఐ ఆఫీసర్‌గా నటించాడు. తను చివరిలో ఇచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. తోటి స్నేహితుడైనా న్యాయం వైపు వుండే ఆఫీసర్‌గా తను నటించి మెప్పించాడు. ఇక పోలీసు కమీషనర్‌గా కృష్ణభగవాన్ చాలా బరువైన పాత్రనే పోషించాడు.
అయితే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా వుండటంతో కథనం నిరాశ కల్గిస్తుంది. స్నేహితులంతా కలిసే సన్నివేశాల కలయిక ఇంకాస్త ఇంట్రెస్ట్‌గా చూపిస్తే బాగుండేది. టెక్నికల్‌గా సంగీత దర్శకుడు మొదటి భాగంలో వచ్చే రెండు పాటల బాణీలు వినసొంపుగా వున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. పరిమిత బడ్జెట్‌లోనే తీసినట్లు కన్పిస్తుంది. దర్శకుడి పరంగా తను ఎంచుకున్న పాయింట్ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా వుంది. కిడ్నాప్ చేయకుండా కిడ్నాప్ అయ్యేలా మెంటల్‌గా టార్చెర్ పెట్టిన తీరులో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. మొదటి ప్రయత్నమయినా బాగానే ఎంచుకున్నాడు. సెకండాఫ్ పైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టడంతో కాస్త నిరాశ కలుగుతుంది. మొత్తంగా ఫర్వాలేదనిపించేలా చేశాడు.
రేటింగ్ : 2.5/5