శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (18:21 IST)

లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకోలేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్రం

కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అమల్లోవుంది. ఈ నాలుగో దశ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ లాక్డౌన్‌ను మరోమారు పొడగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, మరో రెండు వారాలపాటు అంటే జూన్ 14వ తేదీ వరకు ఈ లాక్డౌన్ పొడగించవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి. 
 
వీటిపై కేంద్ర హోం శాఖ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. లాక్డౌన్ పొడగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని దేశ ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, ముంబై, థానే, పూణె, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, సూరత్, ఇండోర్ వంటి ప్రాంతాలపై కేంద్ర ప్రత్యేక దృష్టినిసారించింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం కేసులు నగరాల్లోనే నమోదైవున్నాయి. అందుకే ఈ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై సీరియస్‌గా ఆలోచన చేస్తోంది.