ఆంధ్రాలో కేసీఆర్... బాబుకు బర్త్‌డే గిఫ్టు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారా...?
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖపట్టణంలోని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శారదాపీఠంలోని రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి, విజయ హనుమాన్‌కు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి శారదాపీఠానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు.
సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అంతకుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో విశాఖలో పండగ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వచ్చిన తర్వాత జనాలకు కేసీఆర్ అభివాదం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జైకేసీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు.