శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (17:25 IST)

నిర్భయ కేసు: దోషులకు ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరి

నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిలను వచ్చే నెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరితీయను్నారు. ఈమేరకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సాయంత్రం మరోమారు డెత్ వారెంట్ జారీచేసింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. 
 
దీంతో ఢిల్లీ కోర్టు మరోమారు డెత్ వారెంట్‌ను జారీచేసింది. నిజానికి ఈ నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్షలను అమలు చేయాల్సివుంది. కానీ, ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో ఈ శిక్షలను ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదావేశారు. ఉరితీతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తీహార్ జైలు అధికారులు చేపట్టనున్నారు. 
 
వారిని క్షమించలేం... రాష్ట్రపతి 
ఈ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించాయి. దీంతో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. 'చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆయన క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే, ఇపుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంతో పాటు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్‌ను జారీ చేయడంతో ఫిబ్రవరి ఒకటో తేదీన శిక్షలను అమలు చేయనున్నారు.