శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 22 జూన్ 2016 (14:26 IST)

నుదుట ‘కుంకుమ’ బొట్టు... మహా విష్ణువు నివాసం...

ఎర్రని కుంకుమను నుదుటి మీద చక్కగా గుండ్రంగా దిద్దుకోవడం భారతీయుల ప్రాచీన సంప్రదాయం. మూఖానికి ఆభరణం తిలకం. ఇది అదృష్టాన్ని, అభ్యుదయాన్ని, శుభాన్ని కలుగజేస్తుందనేది పెద్దల మాట. కుంకుమ పెట్టుకొనే నుదుటి మధ్యభాగం మహా విష్ణువు నివాసమని హిందువుల విశ్వాసం. మనస్తత్వ శాస్త్ర రీత్యా నుదుటి పైన తిలకం ఉన్న ప్రదేశం ముఖానికి దృశ్యరూపకేంద్రం. ఇతరుల కళ్ళు ముఖం మీద ప్రసరించగానే తిలకం ఒక స్థూలరూపమైన ఆకర్షణ కేంద్రం అవుతుంది ( ముఖ్యంగా స్త్రీలకు). 
 
శరీరంలో ప్రవహించే రక్తం ఎర్రని రంగులో ఉంటుంది. ఎర్రరంగు ఆరోగ్యవంతమైన చెతన్యాన్ని కలుగజేస్తుంది. అందుకే ఎర్రని కుంకుమను బొట్టుగా పెట్టుకుంటారు. ప్రాచీన కాలంలో ఆర్యులు కుంకుమకు అద్భుత శక్తులున్నాయని నమ్మేవారు. అమ్మ వారిని అర్చించిన పవిత్రమైన కుంకుమను నుదుట ధరిస్తే అది భగవంతుని ఆశీస్సులకు సంకేంతగానే గాక ఒక ఆకర్షణాంశంగా కూడా భాసిస్తుంది. 
 
పద్మ-ఆగ్నేయ పురాణాలలోను, పరమేశ్వర సంహితలోను వివరించిన దానిని అనుసరించి స్త్రీలు చందనం లేక గోపి చందనంతో నొసటి మీద చిన్న నామం దిద్దుకొని, దాని మీద ముత్తయిదవులు కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ప్రతి దినం యథావిధిగా స్నానం చేసి, మంచి గంధంతో లలాటం మీద ఊర్ధ్వ పుండ్రం దిద్ది, దాని మీద కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్త ఆయుర్దాయం పెరుగుతుందని సూచించబడింది. నొసట కుంకుమ బొట్టు ఎప్పుడూ లక్ష్మీ నివాసమని తెలుపుతూ 
“ఊర్ధ్వపుండ్రం లలాటేతు, 
భర్తురాయుష్యవర్ధకమ్ 
లలాటే కుంకుమం చైవ, 
సదాలక్ష్మీ నివాసకమ్” అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోమని పురాణాలు ఆదేశిస్తున్నాయి.