శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (11:50 IST)

అమ్మాయిలూ.. స్కిన్ టైట్ జీన్స్ వేస్తున్నారా... మీ కాళ్లు చచ్చుబడిపోతాయ్....

మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీయువకులు ఫ్యాషన్ మోజు పడిపోతున్నారు. దీనికితోడు కొత్తకొత్త దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకైతే బోలెడన్నీ మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఇలా అనేకం ఉన్నాయి. ఇలాంటి టైట్ దుస్తులను ధరించడం వల్ల అనారోగ్యం బారినపడుతున్నట్టు తాజాగా నిరూపితమైంది. 
 
స్కిన్ టైట్ జీన్స్ ధరించిన ఓ మహిళ కాళ్లు చచ్చుబడిపోయిన సంఘటన తాజాగా ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 35 ఏళ్ల మహిళ ఒకరు స్కిన్ టైట్ జీన్స్ ధరించి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ చాలా సేపు నేలపై కూర్చుంది. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కాళ్లలో నిస్సత్తువ ఆవహించింది. దీంతో ఆమె అడుగు తీసి అడుగు వేయలేక, కాళ్ళపై నిలబడలేక అక్కడే కుప్పకూలిపోయింది. మళ్లీ పైకి లేచి నిలబడలేని దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటన రాత్రిపూట చోటుచేసుకుంది. 
 
దీంతో ఆమెకు సాయం చేసేవారే లేకుండా పోయారు. చివరకు నేలపైనే పాక్కుంటూ రోడ్డుపైకి వెళ్లి ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను వేడుకుని ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెను వైద్యులు పరిశీలించగా, కాళ్ళకు రక్తం సరఫరా నిలిచిపోవడం వల్లే ఇలా జరిగినట్టు నిర్ధారించారు. దీనికి కారణం స్కిన్ టైట్ జీన్స్ ధరించడమేనని తేల్చారు. 
 
స్కిన్‌ టైట్‌ జీన్స్‌ వల్ల కాళ్లకు రక్తసరఫరా నిలిచిపోయి.. కండరాలు, నరాలు చచ్చుబడిపోయాయి. కాళ్లు విపరీతంగా వాచిపోయి.. ప్యాంటును తీసే పరిస్థితి కూడా వైద్యులకు లేదు. దీంతో ఆమె ధరించిన ప్యాంటును నర్సులు కత్తిరించారంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎలాంటి దుస్థితిలో ఉందో! చాలాసేపు ఆ బిగుతు దుస్తులు ధరించి కింద కూర్చోవడం వల్ల మోకాలి నుంచి కింది దాకా రక్తసరఫరా నిలిచిపోయి.. ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. 4 రోజుల చికిత్స అనంతరం ఆమె మళ్లీ ఇప్పుడు మామూలుగా నడుస్తోంది.