బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (09:02 IST)

మణికొండలో మ్యూజిక్ పార్టీ : డ్రగ్స్ సేవించిన 55 మంది అరెస్టు... పెక్కు మంది ఐటీ ఉద్యోగులే...

pubhyd
హైదరాబాద్ నగరంలోని మణికొండలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మణికొండలోని కేవ్ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్.వో.టి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న 55 మందిని అదుపులోకి తీసుకున్నట్టు మాదాపూర్ డీసీపీ వినిత్ మీడియాకు వెల్లడించారు. ఈ కేస్ పబ్ పార్టీలో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో పాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు.
 
ఈ పబ్‌లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్ సేకరించినట్టు గుర్తించాం. 25 మంది పైనా ఎన్పీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. బయట డ్రగ్స్ తీసుకొనే పబ్‌లోకి వచ్చారని విచారణలో తేలింది. సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారు. పక్కా సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్, ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్ పబ్‌ను సీజ్ చేశాం. ఈ కేసులో పబ్ మేనేజర్ శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఐటీ సంస్థలు వారి సిబ్బందికి డ్రగ్స్ తీసుకోవద్దని అవగాహన కల్పించాలి. త్వరలో మిగిలిన పబ్‌లలో కూడా సోదాలు చేస్తాం. గతంలో కూడా ఈ పబ్‌లో ఇలాంటి తరహా పార్టీలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయి. పబ్ యజమానులు నలుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వస్తుందని డీసీపీ వెల్లడించారు.