బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

బీజేపీతో పొత్తుకు తెదేపా రాంరాం... చంద్రబాబు ఏమన్నారు?

రాష్ట్రంలో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ తమను వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామన్నారు.

రాష్ట్రంలో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ తమను వద్దనుకుంటే మా దారి మేము చూసుకుంటామన్నారు. ఆయన శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలపై బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, మిత్రపక్ష ధర్మం పట్ల బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తాను తమ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని అన్నారు.
 
అదేసమయంలో బీజేపీతో కలుస్తానంటూ జగన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదని ఎద్దేవా చేశారు. ఒక మాటపై నిలబడే వ్యక్తిత్వం జగన్‌ది కాదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్... ఇంతవరకు ఎందుకు రాజీనామాలు చేయించలేదని చంద్రబాబు నిలదీశారు. కేసులను ఎత్తి వేయించుకోవడానికి, అక్రమాస్తులను కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాస్తుల్లో చిక్కుకున్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు
 
ఇకపోతే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ 2014 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందని చంద్రబాబు నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో టీడీపీకి 140 నుంచి 145 వరకు సీట్లు వస్తాయని, రాయలసీమలో టీడీపీ మరింత బలం పుంజుకుందనీ ఆ సర్వేల్లో తేలింది. అంతేకాకుండా, కడప, కర్నూలు జిల్లాల్లో కీలక వైసీపీ నేతలు చేరడంతో టీడీపీ బలపడినట్టు స్పష్టమైంది. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం బలహీనంగా ఉందని పేర్కొంది. అయితే, వైకాపాకు పట్టుగొమ్మగా ఉన్న నెల్లూరు జిల్లాలో మాత్రం ఇప్పటికీ టీడీపీ వెనుకబడేవుందట. 
 
ఇకపోతే, కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలంగా ఉండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఎదురు లేదని తేల్చింది. పెన్షన్లు, రేషన్ సరకుల పంపిణీపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు తెలిపింది. అయితే, ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నా... కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. అలాంటి నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టిని సారించనున్నారు.