శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Selvi
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2015 (18:59 IST)

శీతాకాలంలో వేడి వేడిగా క్యారెట్ ఓట్ మీల్ సూప్ టేస్ట్ చేయండి

శీతాకాలం వచ్చేసింది. చలికాలంలో వేడివేడిగా హెల్దీ సూప్ ఇంట్లోనే ట్రై చేస్తే సూపర్‌గా ఉంటుంది. పిల్లలకు నచ్చే విధంగా సూప్‌లను ఇంట్లోనే తయారు చేయవచ్చు. సాధారణంగా సూప్‌ను ఆహారానికి ముందు లేదా అల్పాహారానికి, డిన్నర్‌కి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ క్రమంలో క్యారెట్, ఓట్ మీల్ కాంబినేషన్‌లో సూప్ ట్రై చేద్దాం.. ఈ సూప్ బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే అలసటకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇక సూప్ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు 
ఓట్స్: ఒక కప్పు 
క్యారెట్ తురుము : ఒక కప్పు 
ఉల్లి తరుగు : అరకప్పు 
వెన్న : ఒక టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
మిరియాల పొడి : అర టీ స్పూన్ 
కొత్తిమీర : గార్నిష్‌కు తగినంత. 
 
తయారీ విధానం :  
ముందుగా స్టౌ మీద వెడల్పాటి పాన్‌ను పెట్టి నాలుగు కప్పుల నీళ్లు పోసి సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కల్ని బాగా ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేశాక.. బాగా ఉడికిన క్యారెట్, ఉల్లి ముక్కల్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆపై మరో పాత్రలో వడగట్టుకోవాలి. మరో పాన్‌లో వెన్న వేడి చేసి అందులో ఓట్స్ దోరగా వేయించాలి.

తర్వాత అందులోనే నీళ్లు పోసి మూడు నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. ఓట్స్ ఉడికిన తర్వాత అందులో క్యారెట్ జ్యూస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేంతవరకు మరిగించాలి. అంతే కొత్తిమీర గార్నిష్‌తో ఫ్రైడ్ కార్న్ చిప్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.