శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (05:29 IST)

బంగాళా దుంపలు, టమోటాలు, దోసకాయలు, మొలకెత్తిన గింజలు అతిగా తింటే అంతే సంగతులు... ఎలా?

ఇన్నాళ్లూ మాంసాహారం తింటే బుద్ధి మందగిస్తుందని, జ్ఞాపకశక్తి నశిస్తుందని శాకాహారమే ఉత్తమమైనదని ప్రచారంతో ఊదరగొట్టేవారు. అక్కడికి మాంసాహారులు క్షుద్రులని, శాకాహారులు ఉత్తమోత్తములనే రేంజిలో ఈ ప్రచారం సాగింది. కాని ఇప్పుడు కాలిఫోర్నియా వైద్యులు చెబుతున్న

ఇన్నాళ్లూ మాంసాహారం తింటే బుద్ధి మందగిస్తుందని, జ్ఞాపకశక్తి నశిస్తుందని శాకాహారమే ఉత్తమమైనదని ప్రచారంతో ఊదరగొట్టేవారు. అక్కడికి మాంసాహారులు క్షుద్రులని, శాకాహారులు ఉత్తమోత్తములనే రేంజిలో ఈ ప్రచారం సాగింది. కాని ఇప్పుడు కాలిఫోర్నియా వైద్యులు చెబుతున్న దాని ప్రకారం మనం రోజూ తీసుకునే కాయగూరలు, తృణధాన్యాల్లో కూడా బుద్దిని మందగింప చేసే, జ్ఞాపకశక్తిని హరించే గుణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక మాంసాహారమూ మంచిది కాకుండా, శాకాహారమూ మంచిది కాకుండా ఉండే పరిస్థితుల్లో భూమ్మీద సరికొత్త ఆహారాన్ని కూడా శాస్త్రజ్ఞులే శోధించి కనిపెట్టవలసి ఉంటుందనిపిస్తోంది.
 
బంగాళా దుంపలు, టమోటాలు, దోసకాయలు ఎక్కువగా తీసుకుంటే వీటిలోని ప్రోటీన్ మతిమరుపు వ్యాధికి దారితీస్తుందని తాజా వైద్య అధ్యయనాలు తెలుపుతున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన గుండె వ్యాధి నిపుణులు, సర్జన్ డాక్టర్ స్టీవెన్ గండ్రీ తాజాగా ఒక ప్రకటన చేస్తూ మతిమరుపుకు, జ్ఞాపకశక్తి లోపానికి మధ్య ఉన్న లింకును తాను కనుగొన్నానని చెప్పారు. దీనిప్రకారం బంగాళా దుంపలు, టమోటాలు, దోసకాయలు తృణధాన్యాలు, సోయా, మిరియాలు, మొలకెత్తిన గింజలు, కొన్ని రకాల పాల ఉత్పత్తులను కూడా ఎక్కువగా తీసుకుంటే ఆల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ప్రబలంగా ఉందని చెప్పారు. 
 
ఇలాంటి ఆహార పదార్ధాలు అతిగా తీసుకుంటే చిత్త చాంచల్యం కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వివిధ రకాల రక్త నమూనాలపై జ్ఞాపకశక్తి ప్రభావాలను పరిశీలించిన ఇంగ్లండ్ వైద్యుడు టామ్ గ్రీన్ ఫీల్డ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పైన చెప్పిన ఆహార పదార్థాల్లో ఉన్న ప్రొటీన్ మెదడు వైకల్యాల విషయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అయితే శాకాహార పదార్థాల్లోని ప్రొటీన్ వ్యక్తులపై విభిన్నంగా ప్రభావం చూపుతుంటుందని అది కలిగించే నష్టం వ్యక్తుల జన్యువులను బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు. 
 
రక్తనమూనాలకు నిర్దిష్టమైన లింకు ఉంటుందని, మతిమరుపును కలిగించే శాకాహాక పదార్థాలు అంటే బంగాళా దుంపలు, టమోటాలు, అన్ని రకాల తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు వంటి వాటిని తీసుకోకుండా పూర్తిగా నిలిపివేయటం సాధ్యం కాదని, ఎందుకంటే ఇవి కొందరికి మంచి ఫలితాలను ఇస్తే కొందరికి చెడు ఫలితాలను ఇస్తాయని డాక్టర్ గ్రీన్ ఫీల్డ్ చెప్పారు. మతిమరుపుకు కారణమైన ప్రొటీన్ మానవ శరీరాన్ని, రోగ నిరోధక శక్తిని, మెదడు లోని రక్తనాళాలను కూడా మార్చివేస్తుందని చెప్పారు.  
 
ఈ పరిశోధనల ఫలితాలను రోజుకొక్కతీరుగా మారే వైద్య అధ్యయనాల తీరును గమనిస్తుంటే మన ప్రాచీనులు కచ్చితమైన అంచనాతో చెప్పిన ఒక పద బంధాన్ని మనందరం గుర్తుంచుకుంటేనే బాగుటుంది. అదేమిటంటే... అతి సర్వత్రా వర్జయేత్. ఏదీ అతిగా స్వీకరించరాదు. మన సమకాలీన ప్రపంచంలో ఈ సూత్రానికి నూటికి నూరుపాళ్లు కట్టుబడిన వారు తెలుగు చలనచిత్ర దిగ్గజాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు. 
 
యావత్ ప్రపంచంలో గుండెపోటుకు గురైన తర్వాత బైపాస్ సర్జరీ చేసుకుని అసాధారణమైన ఆహార నియమాలతో మితాహారం పాటించి నలభై సంవత్సరాలు బతికిన ఏకైక వ్యక్తి అక్కినేని ఒక్కరే. 
 
అందుకే మన పురాతన సంచిత జ్ఞానాన్ని కొన్ని విషయాల్లో అయినా గౌరవిద్దాం. అతి సర్వత్ర వర్జయేత్....