పాక్ వ్యక్తిని పెళ్లాడిన భారతీయ మహిళకు భారీగా కానుకలు
ఇటీవల భార్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ఇస్లాం మతంలోకి మారి, పాక్‌లోని తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఆమె మతం మార్చుకుని మరీ పాక్ దేశస్థుడిని పెళ్లి చేసుకోవడంతో ఆ దేశానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీగా కానుకలు ముట్టజెప్పారు. సుమారు 2,722 చదరపు అడుగుల భూమికి సంబంధించిన పత్రాలతోపాటు ఓ చెక్కును ఆమెకు అందజేశారు.
15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్న అంజూ ఇటీవల రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాక్‌కు చెందిన నస్రుల్లా(29)ను ఆమె ఈ నెల 25న పెళ్లి చేసుకుంది. వివాహం కోసం ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఖైబర్ పఖుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిల్ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు.
ఈ ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో అయిన మోసిన్ ఖాన్ అబ్బాసి శనివారం వారి ఇంటికి వెళ్లారు. అంజూకు భూమి పత్రాలతో పాటు ఓ చెక్కును అందజేశారు. అయితే ఎంత మొత్తానికి ఆ చెక్కు ఇచ్చారన్నది తెలియరాలేదు. 'అంజూ భారత్ నుంచి ఇంత దూరం వచ్చి ఇస్లాంలోకి మారి నూతన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఆమెను మా మతంలోకి ఆహ్వానించడంతోపాటు దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను. ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమెకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే కానుకలు ఇచ్చాను' అని అబ్బాసి చెప్పారు.