శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 24 జులై 2019 (20:17 IST)

గంటలో కవిత పూర్తి చేసింది.. 20 రోజుల్లో నాలుగన్నర లక్షల లైక్స్.. బీబీసీ జోహార్

సమాజానికి పట్టిన లింగవివక్ష పీడ, మానసిక ఆరోగ్యం మీదా రాసిన తన కవితలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పద్దెమినిదేళ్ల అమ్మాయి అరణ్యజోహార్‌. పదమూడో యేట తన కవితాప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయిదేళ్లు

"స్కర్ట్స్‌ వేసుకోకు... 
నిర్భయలాంటి ఇన్సిడెంట్స్‌ మర్చిపోయావా నిజమే... 
మరో ఇండియాస్‌ డాటర్‌ కావాలని ఎవరికి మాత్రం ఉంటుంది 
కాబట్టి బుద్ధిగా జీన్స్, ఎద కనిపించనివ్వకుండా 
హైనెక్‌తో మోకాళ్ల కిందికుండే టాప్‌ వేసుకోవడం మొదలుపెట్టా. 
చూసే మొగవాళ్లకు వాంఛలు పుట్టనివ్వకుండా 
తల నుంచి పాదాల దాకా నా శరీరాన్ని కవర్‌ చేసుకోవడం మొదలుపెట్టా’ ...
 
అంటూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున తన కవితాపఠనాన్ని కొనసాగించింది. ఖార్‌లోని ట్యూనింగ్‌ పార్క్‌ హోటల్లో అరణ్య జోహార్ ఇచ్చిన ఈ పెర్ఫార్మెన్స్‌  వెంటనే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయి వైరల్‌ అయిపోయింది. 20 రోజుల్లో దాదాపు 4 లక్షల 45 వేల 975 మంది వీక్షించారు. అదే "బ్రౌన్‌ గర్ల్స్‌ గైడ్‌ టు జెండర్"‌. దేశ, విదేశాల్లోని వేదికల మీదా వినిపిస్తోంది ఆ కవిత. ఫెమినిస్ట్‌ హీరోగా కీర్తినందుకుంటోంది అరణ్య జోహార్‌. ఈ కవితను ఒక గంటలోనే రాసిందట ఆమె. అంత తక్కువ వ్యవధిలో రాసిన ఆ కవితకు ఇంత ఆదరణ లభిస్తుందని ఆ యువకవయిత్రి అనుకోలేదట. తెల్లవాళ్లను పల్లెత్తు మాట అనకుండానే జాత్యహంకారాన్ని ఎండగడుతూనే నల్లవాళ్లు ఎదుర్కొన్న సమస్యలను చెప్పిన కెండ్రిక్‌ లామన్, జె. కోల్‌ రచనలు తనకు ప్రాణమంటున్న కవయిత్రి అరణ్య భారతీయాంగ్ల కవిత్వంలో కొత్త సంతకం. 
 
సమాజానికి పట్టిన లింగవివక్ష పీడ, మానసిక ఆరోగ్యం మీదా రాసిన తన కవితలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పద్దెమినిదేళ్ల అమ్మాయి అరణ్యజోహార్‌. పదమూడో యేట తన కవితాప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయిదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతోంది. మన సమాజానికి పీడ లింగ వివక్ష. నల్లటి ఒంటిరంగు, ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఆంక్షలు, మగవాళ్ల వెకిలిచేష్టలు, రుతుచక్రం,  భర్తలు చేసే మ్యారిటల్‌ రేప్‌ వంటివన్నీ ఆమె స్లామ్‌ పొయెట్రీ అస్త్రాలే. ఇంతవరకు ఏ సీనియర్‌ రచయితా, రచయిత్రులు సిరాను దులపని విషయాలన్నిటి మీద ఆమె ధైర్యంగా... నిష్కర్షగా మాట్లాడుతుంది కవితా రూపంలో. దానికే ‘ఎ బ్రౌన్‌ గర్ల్స్‌ గైడ్‌ టు జెండర్‌’ అనే పేరు పెట్టింది. జనాల్లో జెండర్‌ సెన్సిటివిటీని కలగజేస్తోంది. ఆమె కవితా గానం చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ పోస్టై అరణ్య ఫాలోవర్స్‌ సంఖ్య పెరుగుతోంది. ఇటు దేశంలోనే కాదు.. సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అక్కడా పాపులారిటీ సంపాదించుకుంటోంది.
 
తాము చూసిన దాన్ని...ఆస్వాదించినదాన్ని, అనుభవించినదాన్ని లయబద్దంగా అక్షరీకరించడం కొందరికే చేతనవుతుంది. ఆ కొందరిలో అరణ్య జోహార్‌ ఒకరు. పెద్దపెద్దవాళ్లు... ఫెమినిస్ట్‌లం అని చెప్పుకునే వాళ్లూ మట్లాడ్డానికి సైతం జంకే విషయాలను కూడా  కవితాత్మకంగా వ్యక్తపరుస్తోందీ అమ్మాయి.అమ్మాయి బ్రా స్ట్రాప్‌ కనపడితే సెక్సీ గా ఉందని గుడ్లప్పగించి చూస్తారు. కాని అమ్మాయిల సెక్సువల్‌ రైట్స్‌ని మాత్రం ఒప్పుకోరు. రేప్స్‌కి ఆడపిల్లల వస్త్రధారణే కారణమంటూ సమాజం మైండ్‌ సైట్‌ మార్చేస్తారు మగవాళ్లు! పదకొండేళ్లకే ఆడపిల్లను సెక్సువలైజ్‌చేసేస్తారు... అంటూ ధ్వజమెత్తుతుంది అరణ్య. మ్యారిటల్‌ రేప్‌ అనేది నేరం కాదు.. దాన్ని మొగుడి అవసరంగా ఎలా చెలామణి చేస్తున్నారో అని ఎండగడుతుంది!
 
తన ఆలోచనలను జనంతో పంచుకోవడానికి కవిత్వాన్ని ఆమె వాహకంగా ఎంచుకుంది. కవితను లయబద్దంగా చదువుతూ చదువుతూ ఒక చోట ఆగిపోతుంది... అలా ప్రేక్షకుల ఏకాగ్రతను పరిశీలించడం ఆమెకు ఆసక్తి. ఎక్కడైనా మహిళా సమస్యకు సంబంధించి ఇబ్బందికర పంక్తులు అంటే... ‘‘అమ్మాయిల అవయవాలు ఉన్నవే మగవాళ్లకు ఆనందనివ్వడానికి అని మగవాళ్లు భావిస్తారు’’ అని అరణ్య కవితా రూపంలో వివరిస్తుంటే ప్రేక్షకులు ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూడ్డానికి ఇబ్బందిపడ్తారుట. ఇవన్నీ తన భావవ్యక్తీకరణను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తున్నారో తెలిపే సూచికలంటోంది అరణ్య.
 
లాడ్లీ పన్నెండో వార్షికోత్సవం... ఆ ఈవెంట్‌ను అరణ్యనే జ్యోతి వెలిగించి ప్రారంభించింది. ఆరంభానికి ముందు బ్యాక్‌ స్టేజ్‌లో తన కవితా పంక్తులను శ్రద్ధగా వల్లెవేసుకుంది. స్టేజ్‌ మీద పదాలతో మ్యాజిక్‌ చేసింది. వందల సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు సూది మొన కిందపడ్డా కంగుమని మోగే నిశ్శబ్దంలో ఆమె కవిత్వాన్ని విన్నారు. మంత్రముగ్దులయ్యారు. ఆ వేడుకకు హాజరైన సినీ రచయితలు, దర్శకులు, స్కీన్ర్‌ ప్లే రైటర్స్‌.. ఆమె కవితలోని భావాలతో ఏకీభవిస్తున్నట్టుగా తలలూపారు.. చప్పట్లతో సంఘీభావం తెలిపారు. ఆమె పొయెట్రీ వాళ్లనే కాదు బీబీసీ లాంటి మీడియా హౌజెస్‌ అటెన్షన్‌నూ కొల్లగొట్టింది. జర్మనీలోని న్యూస్‌ అవుట్‌ లెట్స్‌నూ ఆకర్షించింది. జెండర్‌ మీద ఆమె రాసిన ఆ కవితలు జర్మన్‌ భాషలోకీ అనువాదమయ్యాయి.
 
మెంటల్‌ హెల్త్, జెండర్, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి విషయాన్ని చర్చించే ఈ పద్దెనిమిదేళ్ల ముంబై కవయిత్రి అరణ్య జోహార్ ఇప్పుడు యువకవిత్వానికి, నూతన ఫెమినిస్టు తరానికి లేలేత నిర్వచనం. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఇప్పుడు వీస్తున్న కొత్త గాలి అరణ్య. ఆ అరణ్య కవిత్వాన్ని ఆస్వాదించడమే మన పని.
 
యూట్యూబ్‌లో ఇప్పుడు మోగుతున్న ఆంగ్ల కవితా గర్జారావం అరణ్య జోహార్. ఇంగ్లీష్ కవిత్వం అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ స్త్రీలకు సంబంధించి సకలరంగాల్లో చూపుతున్న వివక్షపై  ఆ కవితలు ఇప్పుడు కొత్త యుద్ధారావాలు. ఇంగ్లీష్ అర్థం కాకున్నా ఆమె స్వరంలోని గంగా సదృశ ఝరిని కింది లింకుల్లో వినండి. 
 
 
 
https://www.youtube.com/watch?v=75Eh5OnNeoY
 
https://www.youtube.com/watch?v=ZX5soNoPiII#t=6.606398
 
https://www.youtube.com/watch?v=ZsD0fugxynA
 
https://www.youtube.com/watch?v=qLPKS0E-JjY
 
https://www.youtube.com/watch?v=ZoMgJZFLVXw

https://www.youtube.com/watch?v=5q2XbB46h1Q

Aranya - Buy Now Or Panic Later
(Campus Diaries Mission on Mental Health)
https://www.youtube.com/watch?v=HX8xxUP1_5I