శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (13:46 IST)

ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేక పోయారు.. ఇక 8 మందిని ఎలా ఆకర్షిస్తారు : జవదేకర్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్రమంత్రి, కర్ణాటక రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. 104 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి మద్దతు ఇచ్చేందు

కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్రమంత్రి, కర్ణాటక రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. 104 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక్క స్వతంత్ర ఎమ్మెల్యేను కమలనాథులు కాపాడుకోలేక పోయారు. బుధవారం ఉదయం యడ్యూరప్ప శిబిరంలో కనిపించిన ఆ ఎమ్మెల్యే మధ్యాహ్నానికి కాంగ్రెస్ పంచన చేరిపోయారు.
 
ఈ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు స్వతంత్రుల్లో ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌ ఒకరు. ఈయనను బుధవారం ఉదయం సీఎం యడ్యూరప్ప నివాసానికి మాజీ ముఖ్యమంత్రి ఈశ్వరప్ప తీసుకొచ్చారు. ఆయనతో బీజేపీకి మద్దతునిస్తున్నట్లు చెప్పించారు. ఆ తర్వాత ఏమైదో తెలీదుగాని మధ్యాహ్నానికి శంకర్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో కనిపించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి జవడేకర్‌ ఈశ్వరప్పను క్లాస్‌ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్క ఎమ్మెల్యేనూ కాపాడుకోలేకపోయారా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ వెంట ఉండగానే అతను కాంగ్రెస్‌ నేతలతో ఫోన్‌లో చర్చలు జరుపుతుంటే నిద్రపోయారా? అంటూ మండిపడ్డారు. 
 
దీన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న ఈశ్వరప్ప ముఖం వేలాడేశారు. తమతో ఉన్న ఒక్కగానొక్క స్వతంత్ర ఎమ్మెల్యేను పోగొట్టుకోవడంతో పాపం ఈశ్వరప్ప పరిస్థితి దారుణంగా మారింది. 
 
కాగా, 104 మంది సభ్యులు కలిగిన బీజేపీ గురువారం ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. మరోవైపు, కాంగ్రెస్ (78), జేడీఎస్ (38)ల కూటమికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ కూటమి బలం 118గా ఉంది. అయినప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీకి అవకాశం ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.