శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (08:56 IST)

కాంగ్రెస్ దళపతిగా రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకానున్నారు. ఆ పదవికి నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఆయన ఒక్కరే ఉన్నారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంకానుంది.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకానున్నారు. ఆ పదవికి నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఆయన ఒక్కరే ఉన్నారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంకానుంది. 
 
తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముల్లపల్లి రామచంద్రన్‌కు అందించారు. రాహుల్‌ను  బలపరుస్తూ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ పక్ష నేత  గులాం నబీ ఆజాద్, సీనియర్  నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు  నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. 
 
డిసెంబర్ 5వ తేదీ మంగళవారం నామినేషన్ల స్క్రూటీ నిర్వహిస్తారు. 12వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఈ గడువు పూర్తయిన వెంటనే అదే రోజున పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
నెహ్రూ-గాంధీ  కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికకానున్న ఆరో వ్యక్తి  రాహుల్ గాంధీ. మోతిలాల్  నెహ్రూ ఆ కుటుంబం నుంచి కాంగ్రెస్  అధ్యక్షుడిగా పనిచేసినవారిలో మొదటివారు. స్వాతంత్ర్యం రాకముందు 1928లో మోతిలాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
ఆ తర్వాత సంవత్సరం 1929లో మోతిలాల్ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1930లోనూ నెహ్రూ అధ్యక్షుడిగా పనిచేశారు. మళ్లీ 1936, 37లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951 నుంచి 54 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ కొనసాగారు. 1959లో నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కొద్దికాలం పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. 
 
ఈమె 1978 నుంచి 1984 వరకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇందిర మరణం తర్వాత ఆమె కొడుకు రాజీవ్ గాంధీ 1985లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత 1998లో అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా గాంధీ… ఇంకా అదే పదవిలో  కొనసాగుతున్నారు. దాదాపు 19 ఏళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు.