మంగళవారం, 19 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (17:03 IST)

తితిదే సంచలన నిర్ణయం... రమణ దీక్షితులకు చెక్... 65 యేళ్ళు దాటితే ఇంటికే..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలో ఉంటూ 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త పాలకమండలి సమావేశం తితిదే నూతన ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సార

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవలో ఉంటూ 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని నిర్ణయించింది. కొత్త పాలకమండలి సమావేశం తితిదే నూతన ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సారథ్యంలో జరిగింది. ఈ తొలి సమావేశంలోనే ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు పదవీ విరమణ చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు, టీటీడీ బ్యాంకు డిపాజిట్లు, ఎఫ్ఎంఎస్ పనితీరుపై సబ్ కమిటీలు వేయాలని పాలకమండలి నిర్ణయించింది. 
 
అంతేకాకుండా, ఢిల్లీలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పునర్వసు నక్షత్రం రోజున శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయాల్లో ఆర్జిత కల్యాణం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, రమణ దీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు గుప్పించారు. శ్రీవారి ఆలయం రాజకీయ నాయకుల కంబంధ హస్తాల్లో చిక్కుకునివుందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఆరోపణలపై ఆయన నుంచి వివరణ కోరుతామని టీడీపీ ఈవో అశోక్ సింఘాల్ వెల్లడించారు.