ఎన్నికల సిత్రం : బాండు పేపర్‌పై హామీలు... చదివి పారిపోయిన అభ్యర్థి
ఎన్నికల ప్రచార సమయంలోనే కాదు... పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేస్తామంటూ హామీ ఇవ్వాలని తెలంగాణ ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ హామీ కేవలం నోటి మాటతోకాకుండా లిఖితపూర్వకంగా ఉండాలంటూ వారు తీర్మానించారు. ఇందుకోసం వంద రూపాయల బాండు పత్రంపై ఓటర్లే తమ గ్రామ సమస్యలను రాసి... ఈ హామీలన్నీ నెరవేర్చుతామంటూ హామీ ఇవ్వాలని నిలదీస్తున్నారు.
తాజాగా ఇలాంటి పరిస్థితి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన నేతలకు ఎదురైంది. జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఓట్లు అడిగేందుకు నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెప్పారు. చెరువు నిర్మాణం, నాగిరెడ్డిపల్లి - కొన్నె మధ్య బీటీ రోడ్డు నిర్మాణం, మార్కెట్‌యార్డ్ నిర్మాణానికి భూమి విరాళం ఇస్తానంటూ హామీ పత్రం ఇవ్వాలని పట్టుబట్టారు.
ఆ మేరకు గ్రామస్తులే బాండ్ పత్రంపై ప్రమాణాన్నీ సిద్ధం చేశారు. ఈ హామీలన్నింటినీ మూడు నెలల్లోపు నెరవేరుస్తామంటేనే ఓట్లేస్తామని లేకుంటే లేదని యాదగిరి రెడ్డికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎంత బుజ్జగించినా గ్రామస్థులు దిగిరాలేదు. దీంతో వారి కోర్కెలు తీర్చలేను అనుకున్నారో.. లేక వారివి గొంతెమ్మ కోర్కెలు అనుకున్నారో ఏమో తెలియదు కాని ముత్తిరెడ్డి మాత్రం ఒక్క హామీ ఇవ్వకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు.