శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (11:21 IST)

సంధ్య జీవితం కన్నీటి వ్యథ.. ప్రేమోన్మాది చంపేశాడు...

విద్యావంతుడైన కార్తీక్ అనే ప్రేమోన్మాది ఘాతుకానికి సంధ్యారాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఆ యువతిపై పెట్రోల్ పోసి ప్రేమోన్మాది నిప్పంటించాడు.

విద్యావంతుడైన కార్తీక్ అనే ప్రేమోన్మాది ఘాతుకానికి సంధ్యారాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఆ యువతిపై పెట్రోల్ పోసి ప్రేమోన్మాది నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్య.. హైదరాబాద్ గాంధీ అస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. అయితే, సంధ్యారాణి జీవిత కష్టాల్లోకి తొంగిచూస్తే ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనక తప్పరు. ఆమె కన్నీటి వ్యథను తెలుసుకుందాం. 
 
సికింద్రాబాద్, లాలాపేట్ భజన సమాజం ఏరియాలో నివశించే 22 ఏళ్ల సంధ్యారాణి తండ్రి దాసు - సావత్రిల చివరి సంతానం. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. ముగ్గురు సోదరులకు వివాహాలై వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయినప్పటికీ.. వాళ్లు పుట్టింట్లోనే ఉంటున్నారు. తల్లి సావిత్రితో పాటు అక్కల బాధ్యతను సంధ్యారాణి చూస్తోంది. 
 
బీకాంలో డిగ్రీ పూర్తి చేసిన సంధ్య శాంతినగర్ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్ అల్యూమినియం డోర్స్, విండోస్ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఇక్కడ వచ్చే జీతం డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కుగా మారింది. ఇదే కంపెనీలో కార్తీక్ అనే యువకుడు పని చేస్తూ, సంధ్యతో చనువుగా ఉండేవాడు. లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో కార్తీక్ నివశిస్తున్నాడు. ఈ క్రమంలో సంధ్యను ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, సంధ్య మాత్రం అతడి ప్రేమను తరస్కరించింది. అదేసమయంలో మరో యువకుడితో సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. దీన్ని జీర్ణించుకోలేని కార్తీక్.. సంధ్య తనకు దూరమవుతుందని భావించి ఆమెపై పగబట్టాడు. 
 
ఈ క్రమంలో ఇటీవల సంధ్యారాణికి కార్తీక్ లవ్ ప్రపోజ్ చేశాడు. కుటుంబభారం తనపై ఉండటంతో కార్తీక్ ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది. తన పద్దతి మార్చుకోని కార్తీక్ వేధించసాగాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. ఈ పరిస్థితుల్లో గురువారం సంధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించాడు. అయినా సంధ్యారాణి అతడి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
 
రోజువారీలాగే గురువారం తన విధులు ముగించుకుని కాలి నడకన లాలాపేట్ విద్యామందిర్ మీదుగా సంధ్య ఇంటికి నడిచి వెళుతుండగా అప్పటికే కార్తీక్ పెట్రోల్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6.45 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను మరోసారి ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే.. అక్కడ నుంచి కార్తీక్ పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే కొంత దూరం పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు జరిగిన ఘోరాన్ని సంధ్య వివరించింది. తనపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడని చెప్పి అతడి సెల్  నంబర్‌ను కూడా ఇచ్చింది. ఆ తర్వాత బాధితురాలిని ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసింది. ప్రేమోన్మాది కార్తీక్ గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.