సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (14:02 IST)

వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే కారు - గోదారమ్మ ఉగ్రరూపం

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అదేసమయంలో భాగ్యనగరం గత రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. ఈ కారణంగా వచ్చిన వరద కారణంగా సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులను కూడా ఇబ్బంది పడుతున్నాయి. 
 
గత రెండు రోజులుగా భాగ్యనగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు ఎల్బీనగర్‌లోని గడ్డి అన్నారంలో వరద ఉధృతి నెలకొంది. పలు కాలనీల్లో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం ఉదయం వరద ముంపుకు గురైన కాలనీలలో పర్యటించారు. హస్తినాపురం కాలనీకి వచ్చేసరికి ఆయన కారు వరద నీటిలో చిక్కుకుంది. ఎంత ప్రయత్రించినా కారు ముందుకు కదలలేదు. సెక్యూరిటీతో పాటు కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కారును తోశారు. దీంతో ఎమ్మెల్యే నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం అతికష్టం మీద వరదలో చిక్కుకున్న కారు బయటకొచ్చింది.
 
మరోవైపు, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే మూసీ నది పూర్తిగా నిండిపోవడంతో ఏడు గేట్లు ఎత్తివేశారు. 
 
ఇక, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 1,83,883 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1082.70 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
 
మరోవైపు రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి పరవళ్లు తొక్కుతుండ‌టంతో.. కందకుర్తి త్రివేణి సంగ‌మం వద్ద నీటి ప్ర‌వాహం పెరిగింది. గోదావరి నదిలో గల పురాతన శివాలయం నీట మునిగిపోయింది.
 
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఏ క్షణంలోనైనా సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులు ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 
ఇంకోవైపు, యాదాద్రి భువనగిరి జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షాలకు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు నీటమునిగాయి. ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీట మునిగింది. 
 
యాదగిరి పల్లి నుండి యాదగిరిగుట్ట వచ్చే రహదారిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక యాదగిరి గుట్ట మున్సిపాలిటీ లోని యాదగిరిపల్లి లో పలు కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.