బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (10:46 IST)

హార్ట్ ప్రాబ్లమ్.. గర్భం ధరించింది.. ప్రమాదమని అబార్షన్.. కానీ మృతి.. ఎలా?

అబార్షన్ చేసిన వైద్యుడి నిర్లక్ష్యంతో ఓ టెక్కీ నిండు ప్రాణాలు కోల్పోయింది. రెండు నెలల గర్భవతికి అబార్షన్ వికటించి మృతిచెందిన ఘటన హైదరాబాద్, చైతన్యపురిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. ఆర్కేపురం డివిజన్‌ వాసవీ కాలనీకి చెందిన దివ్య (27)కు కూకట్‌పల్లికి చెందిన వెంకట్‌(29)తో 2018 నవంబరు 11న వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. దివ్య గర్భం దాల్చడంతో చెకప్ చేయించుకునేందుకు చైతన్యపురిలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ చెక్ చేస్తున్న సమయంలో దివ్యకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నట్లు తేలింది. 
 
ఆరా తీయగా తనకు ఏడేళ్ల వయసులో హార్ట్ సర్జరీ జరిగిందని తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గర్భం దాల్చడం సరికాదని.. దివ్యకు ప్రమాదమని డాక్టర్ చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులతో చర్చించిన దివ్య ఫిబ్రవరి 20న ఆస్పత్రికి వచ్చి అబార్షన్ చేయాల్సిందిగా డాక్టర్‌ స్వప్నను కోరింది. దీంతో మందులతో అబార్షన్ జరిగే విధంగా చికిత్స చేయడంతో ఆరు రోజులపాటు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వెళ్లింది.
 
గురువారం రక్తస్రావం కావడంతో తిరిగి ఆసుపత్రికి వచ్చింది. ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. గుండె సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్‌ సలహా తీసుకోకుండా దివ్యకు ఎందుకు గర్భస్రావం చేశావంటూ డాక్టర్ స్వప్నను నిలదీశారు.

ఇంకా ఆస్పత్రి ముందు దివ్య బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే దివ్య చికిత్సకు సంబంధించిన రిపోర్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు మెడికల్‌ బోర్డుకు పంపించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.