1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kumar
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (18:46 IST)

ఏసుదాసు జన్మదిన శుభాకాంక్షలు

ఆయన స్వరం కోట్లాది హృదయాలను గెలుచుకుంది... ఆ స్వరం మనసులను పులకింపజేసింది.. ఆ స్వరం మధురంగా, స్వరరాగ గంగా ప్రవాహంలాగ ధ్వనిస్తుంది... ఆ స్వరం ఉత్సాహాన్ని అందిస్తుంది... భారతీయ సంగీతానికి చెందిన వెలకట్టలేని సంపద ఆ స్వరం... 1961లో మలయాళ చిత్రం ద్వారా వె

ఆయన స్వరం కోట్లాది హృదయాలను గెలుచుకుంది... ఆ స్వరం మనసులను పులకింపజేసింది.. ఆ స్వరం మధురంగా, స్వరరాగ గంగా ప్రవాహంలాగ ధ్వనిస్తుంది... ఆ స్వరం ఉత్సాహాన్ని అందిస్తుంది... భారతీయ సంగీతానికి చెందిన వెలకట్టలేని సంపద ఆ స్వరం... 1961లో మలయాళ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన ఆ స్వరం "మదనకామరాజు" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది... ఆ స్వరమే మన స్వర చక్రవర్తి ఏసుదాసుది. నేడు ఆయన 77వ జన్మదినం.
 
జనవరి 10, 1940వ సంవత్సరంలో కేరళ రాష్ట్రానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఆలిస్ కుట్టి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి కూడా శాస్త్రీయ సంగీత విద్వాంసులు కావడంతో ఏసుదాసు చిన్నప్పటి నుండే సంగీత సాధన ప్రారంభించారు. మొదటిసారి తిరువనంతపురంలోని రేడియో స్టేషన్‌కి వెళితే నీ గొంతు పాటలకు పనికిరాదని ముఖానే చెప్పారు. కానీ స్నేహితుల ప్రోత్సాహంతో ఆయన పట్టువదలకుండా సినిమాలో పాడే అవకాశాన్ని సంపాదించగలిగారు.
 
ఈయన క్రిస్టియన్ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయనకు అయ్యప్ప, మూకాంబిక అంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు కనబరిచేవారు. గత ముప్ఫై ఏళ్ల నుండి ఆయన తన ప్రతి పుట్టినరోజున అయ్యప్ప, మూకాంబిక ఆలయాలకు వెళ్లి దర్శించుకుంటానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఒకనాడు ఫీజు కట్టలేక చదువు మానేసిన తనకు కేరళ, తమిళనాడు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇవ్వడం దైవ ప్రసాదంగా భావిస్తానని చెప్పారు.
 
తన ఐదు దశాబ్దాల తన కెరియర్‌లో దాదాపు భారతీయ భాషలన్నింటితో పాటుగా ఇంగ్లిష్, రష్యన్, మలయ్, అరబిక్, లాటిన్ భాషల్లో కూడా పాటలు పాడారు. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డ్‌లతో సన్మానించింది. ఇవే కాకుండా కేరళ ప్రభుత్వం 24 సార్లు, తమిళనాడు 8 సార్లు, ఆంధ్రప్రదేశ్ 6 సార్లు, కర్ణాటక 5 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డులు ఇచ్చాయి. 2006వ సంవత్సరంలో ఏవిఎం స్టూడియోలో ఒకే రోజున నాలుగు దక్షిణాది భాషల్లో 16 పాటలను రికార్డింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఎక్కువసార్లు రాకపోకలు సాగించినందుకు ఎయిర్ ఇండియా కూడా ఆయనను ఒకసారి సత్కరించడం విశేషం.