శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2017 (12:44 IST)

విజయవాడ చుట్టూ అల్లిన 'ఉందా? లేదా?'... రివ్యూ రిపోర్ట్

ఉందా లేదా మూవీ నటీనటులు : రామకృష్ణ, అంకిత, కుమార్‌ సాయి, జీవా, రామ్‌జగన్‌ ,ఝూన్సీ, ప్రభావతి తదితరులు; సాంకేతికత: బ్యానర్‌ : జయకమల్‌ ఆర్ట్స్‌, ఎడిటర్‌: మణికాంత్‌ తెల్లగూటి, కొరియోగ్రఫీ: నందు జెన్నా, పాటలు: నాగరాజు కువ్వారపు, శేషు మోహన్‌, సింగర్స్‌: సి

ఉందా లేదా మూవీ నటీనటులు : రామకృష్ణ, అంకిత, కుమార్‌ సాయి, జీవా, రామ్‌జగన్‌ ,ఝూన్సీ, ప్రభావతి తదితరులు; సాంకేతికత: బ్యానర్‌ : జయకమల్‌ ఆర్ట్స్‌, ఎడిటర్‌: మణికాంత్‌ తెల్లగూటి, కొరియోగ్రఫీ: నందు జెన్నా, పాటలు: నాగరాజు కువ్వారపు, శేషు మోహన్‌, సింగర్స్‌: సింహ, హేమ చంద్ర, స్వీకర్‌ అగస్సీ, మ్యూజిక్‌: శ్రీమురళీ కార్తికేయ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కె బంగారి, సహనిర్మాతలు: అల్లం సుబ్రమణ్యం, అల్లం నాగిశెట్టి, నిర్మాత: అయితం ఎస్‌ కమల్‌, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్‌.
 
ఏడాది చివరి నెల కావడంతో పాటు పై వారం నుంచి పెద్ద చిత్రాల ధాటికి తట్టుకోలేక పోవడంతో తెలుగులో చిత్రమైన పరిస్థితి నెలకొంది. అందుకే లో-బడ్జెట్‌ చిత్రాలు ఈ శుక్రవారం దాదాపు 15 విడుదలయ్యాయి. అందులో 'ఉందా?లేదా?' అనేది ఒకటి. పూర్తిగా విజయవాడ, ఆ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
విజయవాడలో రాజా హరిశ్చంద్ర మహిళా వసతి గృహం. అందులో వరుసగా ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారు. ఒకరు రుబియా. తను ఉరి వేసుకునేముందు పట్టుచీర, కాళ్ళకు పారాణి పెట్టుకుంటుంది. దీన్ని పరిశోధించే పోలీసు ఆఫీసర్‌ రామ్‌ జగన్‌. ఎక్కడా క్లూ కూడా దొరక్కపోవడంతో మీడియా ఒత్తిడి, హోంమంత్రి నుంచి మాటలు పడలేక... ఓ ప్రైవేట్‌ వ్యక్తి అయిన రామకృష్ణతో హాస్టల్‌పై షార్ట్‌ఫిలిం తీయమని రాంజగన్‌ కోరతాడు. తను ఎలాగైనా సినిమా తీయాలని కలలుకన్న అతను దాన్ని నిరాకరిస్తాడు. కానీ తను ప్రేమించే అంకిత అక్కడే వుండటంతో తనకు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడంతో.. రామకృష్ణ.. హాస్టల్‌పై దృష్టిపెడతాడు. ఆ తర్వాత అతడు ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ :
ఇందులో నటించినవారంతా కొత్తవారే. అంకిత అనే అమ్మాయి పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. హీరోహీరోయిన్లు ఓకే అనిపిస్తారు. రాంజగన్‌ పోలీసు ఆఫీసర్‌గా పర్వాలేదు. ఇటీవల సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ఆదరణ వున్న దృష్ట్యా సింపుల్‌గా సినిమా తీయవచ్చనే ఫార్మెట్‌తో చాలామంది వస్తున్నారు. ఆ కోవలోనిదే ఈ సినిమా. చాలా పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో పారా సైకాలజీ, ఆత్మలు వున్నాయా? లేదా? అనే దాన్ని దర్శకుడు టచ్‌ చేశాడు. 
 
ఆ క్రమంలో భయపెట్టాలనుకున్నాడు. కానీ ఇలాంటి చిత్రాలు గ్రాఫిక్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్ని భయపెట్టాయి. టెక్నాలజీని పెద్దగా వుపయోగించకుండా పరిమితి వనరులతో చేసిన ప్రయత్నమిది. అయితే స్క్రీన్‌పై చెప్పే విధానంలో ఇంకాస్త ఇంట్రెస్ట్‌గా చూపిస్తే బాగుండేది. రామకృష్ణ హాస్టల్‌లో షార్ట్‌ ఫిలిం తీయడానికి వచ్చినప్పుడు అక్కడ వార్డెన్‌ పర్మిషన్‌ కూడా తీసుకోకుండా డైరెక్ట్‌గా తన టీమ్‌తో వచ్చేస్తాడు. 
 
ఆత్మల్ని బయటకు రప్పించడానికి సాయి చదరంగం లాంటి దాన్ని తీసుకువచ్చినప్పుడు కేవలం నలుగురే హాస్టల్‌లో ఉంటారు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అలాంటి టైంలో అంకిత నిద్ర వస్తుందంటూ వెళ్ళిపోతుంది. ఆమెను అలా ఒంటరిగా వదలడం సన్నివేశాన్ని ఇంకాస్త వివరంగా తీయాల్సింది. కానీ, తొలిసారిగా విజయవాడ బేస్డ్‌ కథను తీసుకుని చేయడం విశేషమే. పూర్తిగా అక్కడే తీసిన చిత్రమిది. ఇక హోంమంత్రిణిగా ఝాన్సీ నటించింది. 
 
ఇందులో ప్రత్యేకంగా దర్శకుడు చెప్పింది ఇప్పటి రాజకీయనాయకుల కుటిల తత్త్వం. రాజా హరిశ్చంద్ర ట్రస్ట్‌కు 2 వేల ఎకరాలు, కోట్ల రూపాయల ఖరీదు చేసే మరిన్ని ఆస్తులుంటాయి. వాటిని ఏదోవిధంగా కైవసం చేసుకోవాలని హోమంత్రి కన్నేయడంతో అక్కడ దెయ్యాలు, ఆత్మలు వున్నాయనీ... భయపెట్టి.. ఇద్దరు చావుకు కారణమైన ఆమెకు తగిన శాస్తి చేయడం చిత్ర ముగింపు. ఇలాంటి కథను వర్తమాన పరిస్థితుల కనుగుణంగా రాసుకుని తనకు తగిన సృజనతో దర్శకుడు చేశాడు. సినిమాటోగ్రఫీ ఓకే. నేపథ్య సంగీతం పర్వాలేదు. సాయితో హీరో చేసే సన్నివేశాలు కొంత హాస్యాన్ని ఇస్తాయి. అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం పర్వాలేదు. అయితే దర్శకుడు ఊహించని మలుపులతో ఈ చిత్రాన్ని తీస్తే మరింత బాగుండేది. మొత్తంగా ఇలాంటి కథల్ని ఆదరించే వారికి టైంపాస్‌ మూవీ.
 
రేటింగ్‌ : 2.5/5