గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (17:26 IST)

అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోడీ చెప్పారు... మట్టినీళ్లిచ్చారు : చంద్రబాబు

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకరవు పెట్టారు

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకరవు పెట్టారు. ముఖ్యంగా, తిరుపతి, విజయవాడలలో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను జాతీయ మీడియాకు చూపించారు. 
 
గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోడీ చెప్పారని అన్నారు.
 
మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తర్వాత హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూశామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తాను ఓ లేఖ కూడా రాశానని అన్నారు. మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 
 
అదేసమయంలో పార్లమెంట్ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని... కానీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. చేయాల్సిన సహాయాన్ని చేయకుండానే మాపై విమర్శలు చేస్తూ, ఎదురుదాడి చేస్తున్నారంటూ ఆగ్రహించారు. 
 
నిధులకు సంబంధించిన యూసీలను సమర్పించినప్పటికీ... ఇవ్వలేదని అంటున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా, తమపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన పరపతిని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 
 
దీనికి ప్రధాన కారణం బీజేపీతో వైకాపా లాలూచీపడిందన్నారు. వీరిద్దరికి ఇపుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతకలిశారన్నారు. వీరంతా కలిసి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని నీతి అయోగ్, కేంద్ర ప్రభుత్వం చెప్పాయని తెలిపారు. 
 
ఏపీకి ఎంతో ప్రధానమైన పోలవరం పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా జరుగుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టును నిధులను సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై తాము ఖర్చు చేసిన రూ.3 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలవరంలో జరుగుతున్న పనులను లైవ్ ద్వారా ఆయన చూపించారు. 
 
ఏపీ విడిపోయి నాలుగేళ్లయినా సాయం చేయలేదని, విభజన సమయంలో చాలా నష్టపోయామని వివరిస్తూ చెబుతోన్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఏపీకి సాయం చేస్తున్నామంటూ, త్వరలోనే మరింత సాయం అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ వరకు తాము ఎదురు చూశామని, చివరి బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక సాయం ఏమీ చేయలేదని విమర్శించారు. కనీస సాయం చేయకుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.