శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (18:04 IST)

గోవా - బీహార్‌లను తాకిన కర్ణాటక సెగ... రాజ్‌భవన్‌ గడప తొక్కనున్న కాంగ్రెస్ - ఆర్జేడీ

కర్ణాటక రాజకీయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ ఉన్న కూటమిని కాకుండా, అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్ర

కర్ణాటక రాజకీయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ ఉన్న కూటమిని కాకుండా, అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ తర్వాత కొన్నిగంటల్లోనే ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.
 
ఇపుడు ఇదే ఫార్ములాతో కాంగ్రెస్ పార్టీ గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరనుంది. అలాగే, బీహార్‌లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ కోరుతున్నారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా గోవాలో మాత్రం ప్రకంపనలు రేపుతోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కలిసి శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమది కూడా అతిపెద్ద పార్టీనేనని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాజ్‌భవన్ వరకూ మార్చ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తెరపైకి తేవడానికి కన్నడ రాజకీయం కారణమైంది. 
 
కర్ణాటకలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలు లేకపోయినప్పటికీ.. అతిపెద్ద పార్టీ కావడంతో యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, 15 రోజుల్లోగా ఎమ్మెల్యేల బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆహ్వానించారు. అయితే ఈ పరిణామంపై గోవా కాంగ్రెస్ మండిపడుతోంది. కర్ణాటకలో వర్తించిన నిబంధన తమకు ఎందుకు వర్తింపజేయలేదని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక పొలిటికల్ హీట్ గోవాను తాకడంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. గోవా గవర్నర్ కాంగ్రెస్ డిమాండ్‌పై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
 
అలగే, బీహార్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది. అత్యధిక సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరనున్నట్లు లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్జేడీకి 80 సీట్లు రాగా, జేడీయుకు 70, బీజేపీకి 53 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 27 సీట్లు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. మొత్తంమీద కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.