శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (16:30 IST)

కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. తల్లి మృతదేహం పక్కనే..

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో గుండెలు పిండేసే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కన్నతల్లి ప్రాణాలతో లేదనే విషయం తెలియని ఐదేళ్ళ బాలుడుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమెను విడిచి ఉండేందుకు నిరాకరించాడు.

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో గుండెలు పిండేసే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కన్నతల్లి ప్రాణాలతో లేదనే విషయం తెలియని ఐదేళ్ళ బాలుడుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమెను విడిచి ఉండేందుకు నిరాకరించాడు. ఆస్పత్రి సిబ్బంది పోస్టుమార్టం కోసం ప్రయత్నాలు చేపట్టినా ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి మాటల్లోంచి మాటలకందని దుఃఖం పొంగుకొచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, కాటేదాన్‌కు చెందిన 36 ఏళ్ల సమీనా సుల్తానా అనే మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమె తన బిడ్డతో కలిసి రాజేంద్రనగర్‌లో మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. బిడ్డకు ప్రస్తుతం ఐదేళ్లు. అయితే, సుల్తానా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ వ్యక్తి ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 
 
ఆతర్వాత కాసేపటికే ఆ మహిళ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె పక్కనే ఉన్న ఐదేళ్ల చిన్నారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమెను విడిచి ఉండేందుకు నిరాకరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నాడు. బాలుడి వేదన చూసిన వైద్యులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి చేరుకున్నారు. 
 
తల్లి మృతదేహం పక్కనే బాలుడు 5 గంటలపాటు నిద్రపోయాడు. ఈ ఘటన చూసిన వారి కళ్ల నుంచి అప్రయత్నంగా కన్నీళ్లు పొంగుకొచ్చాయి. చివరికి అతికష్టం మీద 5 గంటల తర్వాత బాలుడిని బలవంతంగా తల్లి నుంచి వేరు చేయగలిగినట్టు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌హెచ్ఎఫ్) వలంటీర్ ఇమ్రాన్ మహమ్మద్ తెలిపారు.
 
ఆ తర్వాత జహీరాబాద్‌లో ఉంటున్న సమీనా సుల్తానా బంధువులను గుర్తించి బాలుడిని వారికి అప్పగించినట్టు తెలిపింది. అ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న సమీనా బంధువులు తదుపరి కార్యక్రమాలను పూర్తి చేశారు. తల్లి మృతదేహం పక్కన నిద్రపోతున్న బాలుడి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాతో కన్నీళ్లు పెట్టిస్తోంది.