శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (19:19 IST)

బీజేపీతో ఇంకా అంటకాగితే చిత్తుగా ఓడిస్తారు : చంద్రబాబుతో నేతలు

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి మనల్ని కూడా చిత్తుగా ఓడిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి అండూ పార్టీ అధినేత, ఏపీ ముఖ

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి మనల్ని కూడా చిత్తుగా ఓడిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి అండూ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద టీడీపీ నేతలు మొరపెట్టుకున్నారు. 
 
గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
 
గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని, ముఖ్యంగా బడ్జెట్‌లో ఏపీకి మొండి చెయ్యి చూపించడంపై వారిలో ఉన్న కోపాన్ని తగ్గించకుంటే, పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. 
 
బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని, వారిలో ఉన్న ఆగ్రహమే మనలోనూ ఉందని చూపేందుకు ఏదో ఒకటి చేయాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ సభలో నిరసన తెలియజేయాలని హోం మంత్రి చినరాజప్ప సూచించగా, ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని మరో మంత్రి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
అయితే, ఏపీ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బేషుగ్గా ఉందన్నారు. ఖచ్చితంగా ఇది మంచి బడ్జెట్ కొనియాడారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూశారనీ, రెండు రోజుల తర్వాత ఈ వివాదం సద్దుమణిగిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.